హెల్త్‌సిటీగా విజయవాడ

22 Apr, 2014 01:36 IST|Sakshi
హెల్త్‌సిటీగా విజయవాడ
  • జగ్గయ్యపేట నుంచి తిరువూరు వరకు పైప్‌లైన్‌తో కృష్ణా జలాలు
  •   పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయిస్తా
  •   ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
  •   ఉపాధి అవకాశాలు పెంపొందిస్తా
  •   వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు వెల్లడి
  •  ‘నాకు విజయవాడపై పూర్తి విజన్ ఉంది. కాళేశ్వరరావు మార్కెట్‌లోని సమస్యల దగ్గర్నుంచి బెంజిసర్కిల్‌లో ట్రాఫిక్ కష్టాల వరకు సమగ్ర అవగాహన ఉంది. జగ్గయ్యపేటలో సాగు, తాగునీటి సమస్య.. తిరువూరు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నాయని తెలుసు. జిల్లా ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయదారుల ఇబ్బందులు... ఇలా అన్నింటిపై ఉన్న అవగాహనతో విజన్ విజయవాడను రూపొందించుకున్నా. దీనికి అనుగుణంగానే ప్రజలకు సేవ చేయడానికి వారధిగా నిలిచే రాజకీయాలను ఎంచుకుని మీ ముందుకొచ్చా..’ అంటున్నారు వైఎస్సార్ సీపీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్.
     
    సాక్షి, విజయవాడ : ప్రజలకు, సమాజానికి సేవచేయాలనే తలంపుతో వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకంటే ప్రచారపర్వంలో దూసుకెళుతున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా అభివృద్ధికోసం తాను రూపొందించుకున్న ప్రణాళికలు.. విజయవాడ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలవారీగా ప్రధాన సమస్యలు.. వాటికి తాను సూచించే ఆచరణాత్మక పరిష్కార మార్గాలు.. ఇలా పలు అంశాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే...
     
    జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఇతర రాజకీయ పార్టీ నేతలను విమర్శించను. నన్ను విమర్శించేవారిని సైతం విమర్శించను. పాజిటివ్ రాజకీయాలతోనే ముందుకు సాగుతా. నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పి మరీ ప్రజలను ఓట్లడుగుతున్నాను.
     
    వైద్యపరంగా ఉపాధి..

    ముఖ్యంగా వైద్యపరంగా విజయవాడ నగరానికి మంచి పేరుంది. అనేక కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రభుత్వాస్పత్రి, నిపుణులైన వైద్యులు ఎందరో ఉన్నారు. విజయవాడను హెల్త్ సిటీగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 15 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాళాల, వైద్యానికి సంబంధించి అన్ని విభాగాలు, కోర్సులతో కలిపి యూనివర్సిటీ, స్కూల్‌ను ఏర్పాటుచేయడం నా లక్ష్యం.

    తద్వారా సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, సుమారు ఐదు వేల మందికి సొంతప్రాంతంలోనే నాణ్యమైన విద్య లభిస్తాయి. హెల్త్ సిటీకి అనుసంధానంగా ఫార్మా కంపెనీలు, ల్యాబ్‌లు ఇలా అనేకం ఏర్పాటుచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఉచిత వైద్యం హెల్త్ సిటీలో అందితే వాణిజ్యపరంగానూ నగరం పురోగతి సాధిస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ‘విజన్ విజయవాడ’ను రూపొందించుకున్నా. దీనికోసం పంచ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను.
     
     డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా..

    విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మూడు ప్రధాన నీటి కాల్వల్లోకి 126 మురుగునీటి కాల్వలను అనుసంధానం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి డ్రైనేజీ కాల్వలను దారిమళ్లించాలి. నీటి కాల్వల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తను, నీటిని వేరుచేసేలా ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలి. వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రకియ ద్వారా చెత్తను వినియోగిస్తే  ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు స్వీయ నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.
     
     ప్రజల గుండెల్లో వైఎస్సార్..

    మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఆయన పార్టీ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్లినప్పుడు మమ్మల్ని కూడా అదే అభిమానం, ఆప్యాయతలతో ఆదరిస్తున్నారు.. స్వాగతిస్తున్నారు. పార్లమెంట్ పరిథిలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తిచేశాను. అక్కడి ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. నాకు కమిట్‌మెంట్ ఉంది. నా సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించకున్నా. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను.  
     
     కోనేరు ట్రస్టుద్వారా నీరు..

     శ్రీకాకుళం జిల్లాలో కోనేరు ట్రస్టుద్వారా వంశధార నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుచేసి వేలాది ఎకరాలకు  సాగునీరందిస్తున్నాను. అవసరమైతే  ఇక్కడా ప్రణాళిక రూపొందించేందుకు  సిద్ధంగా ఉన్నాను. కృష్ణానది పక్కనే ఉన్న జగ్గయ్యపేట మొదలుకొని తిరువూరు వరకు నీటి సమస్య ఉంది. దీని పరిష్కారం కోసం పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తే అటు తాగునీరు, ఇటు సాగునీటి అవసరాలు తీరతాయి.
     
     ఫ్లైవోవర్ల ఏర్పాటు..

     మౌలిక వసతుల్లో భాగంగా దుర్గగుడి వద్ద, బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తక్షణం ఫ్లైవోవర్లు నిర్మించాలి. మా పార్టీ అధికారంలోకి రాగానే తొలి్ర పాధాన్యతాంశంగా దీన్నే తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలి. బీఆర్‌టీఎస్ రోడ్డు వల్ల నగరానికి పెద్దగా ఉపయోగం చేకూరలేదనేది నా అభిప్రాయం. దానికి ఖర్చుచేసిన రూ. 152 కోట్ల నిధులతో 15 ఫ్లైవోవర్లు నిర్మించి ఉంటే ట్రాఫిక్ సమస్య సమసిపోయేది.
     
     బుడమేరుకు శాశ్వత పరిష్కారం..

     నగరంలో మరో ప్రధాన సమస్య బుడమేరు ముంపు. దీనికి శాశ్వత పరిష్కారం చూసేలా అన్ని చర్యలు తీసుకుంటాం. అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, పులిచింతల ప్రాజెక్టు నుంచి జిల్లా సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, పోలంపల్లి రాజీవ్ మున్నేరు డ్యామ్ నిర్మాణం పూర్తి చేయిస్తాం.
     
     పారిశ్రామికాభివృద్ధి..

     విజయవాడ ఆటోనగర్‌ను కేంద్రంగా చేసి విడిభాగాల తయారీ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాం. రవాణాయేతర రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థల్ని అవసరమైతే నా సొంత నిధులతో ఏర్పాటుచేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.

మరిన్ని వార్తలు