వైద్య మంత్రి క్యాంపు కార్యాలయంపై తర్జనభర్జన

2 Aug, 2014 02:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో :  వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నెల  15వ తేదీ నుంచి కార్యాలయం ప్రారంభమవుతుందని, హైదరాబాద్‌లోని వివిధ విభాగాల హెచ్‌వోడీలు ఇకపై విజయవాడ నుంచే పనిచేస్తారని మంత్రి కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలోని సిల్వర్ జూబ్లీ భవనం హెచ్‌ఓడీలందరికీ సరిపోదని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ డెరైక్టరేట్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  కార్యాలయాల ఆధునికీకరణకు ఇటీవలే రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సరైన సౌకర్యాలు లేకుండా విజయవాడలో  ఏర్పాటు చేసే క్యాంప్ కార్యాలయానికి రావడానికి సుముఖంగా లేనట్లు చెబుతున్నారు.  

మంత్రి కామినేని పట్టుబడితే హైదరాబాద్‌లో ఉన్న సిబ్బం దిలో 20 శాతం మందిని విజయవాడ పంపాలనే యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. హెచ్‌వోడీలు, ముఖ్య అధికారులంతా హైదరాబాద్‌లోనే ఉండే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటించినట్లు 15వ తేదీకి క్యాంప్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు