సీసీటీవీల మధ్య పీజీ మెడికల్ కౌన్సెలింగ్

29 Apr, 2015 09:42 IST|Sakshi

విజయవాడ: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం ఉదయం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. గత సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సీసీటీవీ కెమెరాల మధ్య కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తున్నారు. మార్చి 1న నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8,992 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కన్వీనర్ కోటా కింద మొత్తం 1,860 సీట్లకు ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతుంది.

ఇందులో 1,193 సీట్లు నాన్‌సర్వీస్ అభ్యర్థులకు, 667 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 గంటల నుంచి కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తొలి రోజు జరిగే కౌన్సెలింగ్‌కు ఒకటి నుంచి 800 ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 1 నుంచి నిర్వహించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు మే 15లోగా ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పోంది, 16న చేరాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు