వైద్యం అందించి ఆదుకోండయ్యా..!

25 Mar, 2020 12:28 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమణయ్య

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమణయ్య

వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రసాద్‌నాయుడు ఆర్థికసాయం

నెల్లూరు, కావలి: అనారోగ్యంతో గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఓ పేదవాడికి తనకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే రమణయ్య వైద్యం చేయించుకునేందుకు అవసరమైన నగదు లేక అవస్థలు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆర్థికసాయం చేయగా కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరాడు. అయితే రేషన్‌కార్డు లేనందున ఆరోగ్యశ్రీ వర్తించదని సదరు ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో అధికారులు ఆదుకోవాలని బాధితుడు వేడుకొంటున్నాడు. వివరాలు.. కావలి నియోజకవర్గంలోని దగదర్తి అరుంధతీయవాడకు చెందిన మందా రమణయ్య అనారోగ్యంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు.

అక్కడి వైద్యులు పరీక్షలు చేసి అతను గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. రమణయ్య పరిస్థితిని తెలుసుకొన్న వైఎస్సార్‌సీపీ దగదర్తి మండల కన్వీనర్‌ తాళ్లూరు ప్రసాద్‌నాయుడు నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ రూ.70,000 ఖర్చు కాగా, దానికి సంబంధించిన బిల్లులు ప్రసాద్‌నాయుడు చెల్లించారు. గుండెకు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పడంతో ఆరోగ్యశ్రీ కింద చేయాలని రమణయ్య కుటుంబసభ్యులు కోరారు. అయితే వారికి రేషన్‌కార్డు  లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించేందుకు కుదరదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో రమణయ్య కుటుంబసభ్యులు నిరుపేదలమైన తమకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించాలని కోరారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే తమ ఇంటి పెద్దదిక్కు అయిన రమణయ్యకు వైద్యం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని భార్య జయమ్మ, పిల్లలు అధికారులను వేడుకొంటున్నారు.

మరిన్ని వార్తలు