పోలాకి తహసీల్దార్‌కు గుండెపోటు!

3 Nov, 2018 08:26 IST|Sakshi
కిమ్స్‌లో తహసీల్దార్‌ రామారావుని పరామర్శిస్తున్న అధికారులు

తుపాను విధుల్లో పని ఒత్తిడే కారణం!

కిమ్స్‌లో ప్రాథమిక చికిత్స.. అనంతరం విశాఖకు తరలింపు  

పోలాకి/శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  తిత్లీ తుపాను ప్రభావిత మండలా ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు.. పనిఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న అధికారుల సంఖ్య  రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా పోలాకి మండల తహసీల్దార్‌ జెన్ని రామారావు శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యా రు. దీంతో వెంటనే అతన్ని శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి, జేసీ–2 పి.రజనీ కాంతరావు, డీఆర్‌వో నరేంద్రప్రసాద్, కలెక్టరేట్‌ ఏవో రమేష్‌బాబులు కిమ్స్‌కు చేరుకొని రామారావును పరామర్శించారు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విధాలా ప్రభుత్వం ద్వారా వైద్య సదుపాయాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రామారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలిసి కుటుంబసభ్యులు విశాఖపట్నానికి రామారావును తరలించారు. ఈయన   తుపాను విధుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి పోలాకిలో మండల ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. సుమారు 28 రోజులుగా విధుల్లో ఉంటున్న ఆయన అలసటకు గురయ్యారు. విధుల్లో ఒత్తిడి పెరడంతోనే  గుండెపోటుకు గురయ్యారని రెÐవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నలుగురు తహసీల్దార్‌లు అస్వస్థతకు గురికాగా టెక్కలి ఆర్డీవో దఫేదార్‌ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారని అసోసియేష¯న్‌ జిల్లా అధ్యక్షుడు పి. వేణుగోపాలరావు అన్నారు.  తుపాను విధుల్లో ఉన్న అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్నామ్యాయ చర్యలపై దృష్టి సారించాలని కోరారు.

మరిన్ని వార్తలు