రెండు గంటల్లో గుండె మార్పిడి

25 Dec, 2013 10:54 IST|Sakshi
రెండు గంటల్లో గుండె మార్పిడి

సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్సను రెండు గంటల్లోనే పూర్తి చేయడం, అతి చిన్న కోతతోనే ఆపరేషన్ పూర్తి చేయడం, బాధితురాలు వారం రోజుల్లోనే కోలుకోవడం.. ఇలా అన్నీ ఇందులో విశేషాలే.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన వెంకట రమ్య (25) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హృద్రోగ నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే.. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో గుండె దాతల కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదన రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువకుడి గుండెను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. జీవన్‌దాన్ సిబ్బంది ఈ విషయాన్ని యశోద ఆస్పత్రికి తెలియజేశారు. వెంటనే లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 16వ తేదీన ఆపరేషన్ నిర్వహించి యువకుడి నుంచి గుండెను వేరుచేశారు.

అదే సమయంలో రమ్యకు శస్త్రచికిత్స చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు గతంలోలాగే అమోఘమైన పాత్ర పోషించారు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్‌కు అత్యంత తక్కువ సమయంలో గుండెను తరలించారు. రెండు గంటల్లోనే శస్త్రచికిత్స కూడా చేశారు. శస్త్రచికిత్స పూర్తయినే రెండు గంటల్లో సాధారణ రక్తప్రసరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ శస్త్రచికిత్సలో వైద్యులు గోపాలకృష్ణ గోఖలే, విశ్వనాథ్, దిలీప్‌రాఠీ, సుబ్రమణ్యం, సుధాకర్, మాధవ్, సాయిచంద్ర పాల్గొన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా యశోద చైర్మన్ జీవీ రావు మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి వైద్య సేవలకు ఇది వేదిక అని స్పష్టమైందన్నారు.

మరిన్ని వార్తలు