వణికిస్తున్న వడగాలులు

18 Jun, 2014 02:08 IST|Sakshi
వణికిస్తున్న వడగాలులు

42 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఉదయం నుంచే వేడి గాలులు   అర్ధరాత్రి దాటినాతగ్గని తీరు
భారీగా పెరిగిన వడదెబ్బ మృతుల సంఖ్య
బయటికి రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం

 
జిల్లాలో వడగాలులు వణికిస్తున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజులుగా వడదెబ్బకు గురై మృతిచెందుతున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పగటివేళ బయటికి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రోహిణీ వెళ్లిపోయింది.. ఇక వాతావరణం చల్లబడుతుందని ఆశించినవారికి అడియాసే ఎదురైంది. మృగశిర కార్తె ప్రవేశించినా ఎండలు తగ్గకపోగా.. వాటికి వడగాలులు తోడయ్యాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. జూన్ 17వ తేదీ వచ్చినా రుతుపవనాల జాడ లేకపోవడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.     
 
 మచిలీపట్నం :  గత వారం రోజులుగా జిల్లాలో సగటున 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచే వడగాలులు ప్రారంభమవుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యమైన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల పాటు కోస్తా తీరంలో ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతాయని విశాఖపట్నం రాడార్ కేంద్రం అధికారి నరసింహారావు తెలిపారు. రుతుపవనాలు బాపట్ల, నంద్యాల వరకు వచ్చాయని చెప్పారు. కోస్తా తీరంలో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందన్నారు. దీనికి తోడు ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తా తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉందని, దీంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని ఆయన తెలిపారు.

క్యూములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ వర్షాలు నమోదైనా సముద్రతీరం వెంబడి వేడిగాలులు వీస్తున్నాయన్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో జిల్లాలో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వడగాలుల తీవ్రత అధికమైతే ఒంటిపూట బడులను కొనసాగించాలని ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. వడగాలుల కారణంగా జనం బయటికి రావడానికి భయపడుతున్నారని, దీంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు