నేడు దక్షిణ కోస్తాలో వడగాడ్పులు!

12 Jun, 2019 04:13 IST|Sakshi

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,కృష్ణా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు 

మూడు రోజులు వానలు పడే అవకాశం 

కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కూడా ఈ వడగాడ్పులు ప్రభావం చూపనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. మరోపక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం ఈశాన్య బంగాళాఖాతంలోకి మళ్లింది.

ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తన నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పిడుగులకు ఆస్కారం ఉందని తెలిపింది. 

మరిన్ని వార్తలు