బెజవాడలో బేజారెత్తిస్తున్న ఎండలు 

24 May, 2020 13:51 IST|Sakshi

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 

పలుచోట్ల 40–45 డిగ్రీలు నమోదు 

బేజారెత్తిస్తున్న ఎండలు 

మరికొన్ని రోజులు కొనసాగనున్న వడగాడ్పులు  

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాను వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. సాధారణం కంటే నాలుగు నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మున్ముందు ఇవి మరింత ప్రతాపం చూపించనున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఎండ‌లు నిప్పుల వ‌ర్షాన్ని త‌ల‌పిస్తుండ‌టంతో జ‌నం అల్లాడుతున్నారు. ఉదయం ఏడెనిమిది గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి మరింత మండుతున్నాడు. ఇలా సాయంత్రం వరకూ సెగలు కక్కుతున్నాడు. 

రాత్రి వేళ కూడా వేడిగాలులు వీస్తూ జనాన్ని అవస్థలు పెడుతున్నాయి. దీంతో తెల్లారిందంటే చాలు.. మళ్లీ వడగాడ్పులు ఎలా ప్రతాపం చూపుతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.  గత మూడు రోజులుగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. నెలాఖరు వరకూ ఇదే విధమైన ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో నాలుగు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది.

విజయవాడ‌లో అత్యధికం 
జిల్లాలో శనివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న విజయవాడలో అత్యధికంగా 45.1, రూరల్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీరులపాడులో 44.2, తిరువూరు 43.2, చందర్లపాడు 42.9, విజయవాడ నగరం, గన్నవరం విమానాశ్రయంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

రోహిణీ కార్తెలో.. 
ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఇప్పటికే వడగాడ్పుల తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. రోహిణీ కార్తె ప్రవేశిస్తే గాడ్పుల తీవ్రత మరింత పెరగనుంది. రానున్న రెండు రోజులు కృష్ణా జిల్లాలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు.  

ఎందుకిలా? 
ఇటీవల సంభవించిన ఉంపన్‌ తుపాను గాలిలో తేమను లాక్కుని పోయింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రం వైపు ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ, వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఇవి ఉష్ణగాలులను మోసుకు వస్తున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వడగాడ్పుల వేళ జనం ఇళ్లలోనే ఉండాలి. 
  • తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే గొడుగు ధరించాలి. 
  • తలకు, ముఖానికి మాస్క్‌/కర్చీఫ్‌ కట్టుకుని వెళ్లాలి. 
  • బయటకు వెళ్లి వచ్చాక తీపి పదార్థాలు తినకూడదు. 
  • తరచూ మంచినీళ్లు తాగాలి. 
  • డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం నీళ్లు తాగాలి.  
  • తెల్లని కాటన్‌ వస్త్రాలు ధరించాలి.  
  •  ఐస్‌ నీళ్లు, కూల్‌డ్రింకులు తాగకూడదు.  

మరిన్ని వార్తలు