ఏపీలోనే అ'ధనం'

21 May, 2019 03:44 IST|Sakshi

ముందే నిర్థారణకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల్లో భారీగా పట్టుబడిన ధనం, మద్యం, బంగారం

మొత్తం విలువ రూ.216.34 కోట్లు

గత ఎన్నికల్లో పట్టుబడింది రూ.141.13 కోట్లు 

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆదివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో రూ.2,628 కోట్ల ధనం, మద్యం, బంగారం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుబడిన వాటి విలువ రూ.216.34 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా పట్టుబడిన మొత్తం విలువలో ఇది పది శాతం. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఏ మేరకు ధనం, మద్యం ఏరులై పారిందో.. ఓటర్లను ఎంతగా ప్రలోభాలకు గురి చేశారో స్పష్టమౌతోంది.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయకముందే దేశంలో అత్యంత అధికంగా ధన ప్రభావం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అధికార పార్టీ భారీ ఎత్తున ధనం, మద్యాన్ని పారించేందుకు సిద్ధమైన నేపధ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా వేలాది కోట్ల రూపాయలను, లక్షలాది కేసుల మద్యాన్ని నియోజకవర్గాలకు తరలించారు. ఇందులో పది శాతం మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. 

తమిళనాడుతో పోటీ
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడుతో పోటీగా ఏపీలో భారీగా సొమ్ము పట్టుబడింది. తమిళనాడులో రూ.514 కోట్లు పట్టుబడగా, ఏపీలో రూ.216.34 కోట్లు సీజ్‌ చేశారు. తెలంగాణలో అన్నీ కలిపి రూ.77.49 కోట్లు సీజ్‌ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రూ.141.13 కోట్ల ధనం, మద్యం, ఇతర సామగ్రిని సీజ్‌ చేశారు. ఇప్పుడు రూ.216.34 కోట్ల విలువైన ధనం, వస్తువులు సీజ్‌ చేయడం గమనార్హం.

ఏరులై పారిన మద్యం
ఈ ఎన్నికల్లో ఊరూ వాడల్లో మద్యాన్ని ఏరులై పారించారు. గత ఎన్నికల్లో రూ.12.92 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా.. ఈ దఫా రూ.26.31 కోట్ల విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు