కొంపలు ముంచుతున్న అతివేగం

11 Dec, 2014 03:23 IST|Sakshi
కొంపలు ముంచుతున్న అతివేగం

* భారీగా పెరుగుతున్న బైక్ ప్రమాదాలు
* ర్యాష్ రైడింగ్‌తో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువత
* పట్టించుకోని కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు

పలమనేరు: పలమనేరు పట్టణానికి చెందిన మునిచంద్రయ్య కుమారుడు స్థానిక మదర్‌థెరిస్సా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. తల్లిదండ్రులతో కొట్లాడి బజాజ్ పల్సర్ 220 సీసీ బైక్ కొన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కళాశాల సమీపంలో నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.

మూడ్రోజుల క్రితం పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. మూడు నెలలక్రితం పెళ్లయిన యువకుడు మృతి చెందగా, మరో యువకుడు ప్రస్తుతం కోమా లో ఉన్నాడు. ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో మూడేళ్లుగా భారీగా పెరిగాయి.
 
అతివేగంతోనే అనర్థాలు..
ప్రస్తుతం అధిక సామర్థ్యం కలిగిన పలు రకాల బైక్ లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికితోడు సినిమాలు, టీవీల ప్రభావంతో యువత మోటర్‌బైక్‌ల వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. మార్కెట్‌లోకొ చ్చే కొత్త బైక్‌లను కొని రైడింగ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు బైక్ లేని దే బయటకు రావడం లేదు. కొందరు తల్లిదండ్రులను వేధించి మరీ కొంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఆర్భాటాలకు పోయి బైక్‌లు కొనిస్తున్నారు. అతివేగంగా వెళ్లడం, హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
 
భారీగా పెరుగుతున్న బైక్ ప్రమాదాలు..

రెండేళ్లుగా జిల్లాలో బైక్ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. 2013లో 58 బైక్ ప్రమాదాలు జరగగా ఎనిమిది మంది చనిపోయారు. 2014లో 38 రోడ్డు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వారు 60 మందికి పైగా ఉన్నారు. ఈ ప్రమాదాలన్నీ అతివేగం కారణంగా జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
 
బెట్టింగులు, ర్యాష్ రైడింగ్‌ల జోరు..
తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట యువకులు బైక్ బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు బస్సుల్లో వెళ్లే తమ స్నేహితురాళ్లను ఫాలో అవుతూ బస్సు వెనకే రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇంకొందరు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలకు గురైన వారిలో చాలా మందికి లెసైన్సులు కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై కళాశాల యాజమాన్యాలు, ఎంవీఐ, పోలీస్ యంత్రాంగం, తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
నిబంధనలు పాటించకపోతే చర్యలు..

బైక్‌లకు సంబంధించి ర్యాష్ డ్రైవింగ్, బెట్టింగ్ తదితరాలపై దృష్టి సారించాం. డ్రైవింగ్ లెసైన్స్, హెల్మెట్ లేకుండా వెళ్లే వారిపై చర్యలు తప్పవు. ముఖ్యంగా అండర్ ఏజ్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తాం. కళాశాల యాజమాన్యాలు సైతం విద్యార్థులకు అవగాహన కల్పించాలి.    -డీఎస్పీ హరినాథరెడ్డి, పలమనేరు
 
తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలి..

ప్రిస్టేజీలకు పోయి పిల్లలకు బైక్‌లు కొనివ్వడం పొరపాటు. ప్రాణం పోతే తిరిగి రాదు. ఇప్పుడొస్తున్న కొత్త తరహా బైక్‌లు ఈ రోడ్లకు అనుకూలంగా లేవు. అధిక సీసీ కలిగిన బైక్‌లతో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అనుభవం లేని, డ్రైవింగ్ లెసైన్స్ లేని యువతపై దృష్టి సారిస్తాం. -మధుసూదన్, ఎంవీఐ, పలమనేరు

మరిన్ని వార్తలు