తగ్గిన మందు.. చిందు!

2 Jan, 2020 03:59 IST|Sakshi

ఈసారి నూతన ఏడాది వేడుకల్లో భారీగా తగ్గిన వినియోగం

గతేడాది రూ.120 కోట్ల విక్రయాలు

ఈసారి రూ.105 కోట్ల మేర అమ్మకాలు

సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. గతేడాది కొత్త సంవత్సర సంబరాలతో పోలిస్తే ఈదఫా 72,243 మద్యం కేసులు తక్కువగా అమ్ముడు కావడం గమనార్హం. గతేడాది 2,05,087 మద్యం కేసులు విక్రయించగా ఈసారి 1,32,844 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక బీర్ల వినియోగం సైతం అమాంతం తగ్గింది. గత ఏడాది వేడుకల్లో 1,45,519 బీరు కేసుల వినియోగం జరగ్గా ఈసారి వేడుకల్లో కేవలం 50,995 బీరు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది కంటే 94,524 బీరు కేసుల వినియోగం తగ్గింది. 

సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు 
ఇక విక్రయాల విషయానికొస్తే గతేడాది నూతన సంవత్సర వేడుకల్లో రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగ్గా ఈదఫా రూ.105 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అమ్మకాలు రూ.15 కోట్లు మాత్రమే తగ్గగా వినియోగం భారీగా తగ్గడం గమనార్హం. మద్యం ధరలను  పెంచడంతో రూ.105 కోట్ల అమ్మకాలు కనిపిస్తున్నా వినియోగంలో మాత్రం వ్యత్యాసం ఉండటంతో దశలవారీ మద్య నిషేధానికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అవగతమవుతోంది.

ప్రజారోగ్యానికే పెద్దపీట 
మద్యం అమ్మకాల్ని సాధారణ రోజుల్లో ఎలా చేపడుతున్నారో ఈసారి డిసెంబరు 31న కూడా అదే విధానాన్ని అమలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి 1 గంట వరకు విక్రయాలు నిర్వహించి మందుబాబులతో పూటుగా తాగించి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా డిసెంబరు 31, జనవరి 1న రెండు రోజుల్లో కలిపి రూ.200 కోట్ల మద్యం ఆదాయం రాగా ఇప్పుడు 2 రోజుల్లోనూ రూ.125 కోట్లు దాటకపోవడం గమనార్హం. ఈసారి జనవరి 1న రూ.19.78 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రజలంతా కుటుంబాలతో కలసి కొత్త ఏడాది రోజు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్యాన్ని దూరం చేసింది.  

కృష్ణాలో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం 
కొత్త ఏడాది సందర్భంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయించగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా విక్రయాలు నమోదయ్యాయి. కృష్ణాలో రూ.17.42 కోట్ల విలువైన మద్యం తాగగా కర్నూలులో అత్యల్పంగా రూ.3.12 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇక వినియోగం పరంగా చూస్తే గత ఏడాది వేడుకల్లో కృష్ణా జిల్లాలో 21,213 కేసుల మద్యం, 13,012 కేసుల బీరు అమ్ముడు కాగా ఈదఫా 19,553 కేసుల మద్యం, 5,824 కేసులు మాత్రమే బీరు వినియోగం నమోదైంది.

>
మరిన్ని వార్తలు