‘లైన్’లోకొస్తే లాభం లేదు

30 Jan, 2015 02:24 IST|Sakshi

  భారీ మంచినీటి పథకాల నిర్వహణ
   పనుల టెండర్లలో అధికార పార్టీ జోక్యం
  ఆన్‌లైన్ టెండర్లలోకి వెళ్లకుండా సెట్టింగ్
  వారి ఆలోచనలకు తగ్గట్టుగా అధికారుల చర్యలు
  పని విలువ తగ్గిపోవడంతో సాధారణ టెండర్లకే పరిమితం    
  తటస్థ కాంట్రాక్టర్లకు  బెదిరింపులు, హెచ్చరికలు

 
  సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం మంచినీటి పథకం నిర్వహణ పనుల కాంట్రాక్ట్ టెండర్‌ను రెండు నెలల కాల పరిమితితో పిలిచారు. ఆ రెండు నెలలకు రూ.9.17లక్షలు పని విలువగా నిర్ణయించారు. ఇంకేముంది ఆన్‌లైన్ టెండర్ల నుంచి మినహాయింపు పొందినట్టు అయ్యింది. అదే.. ఏడాది కాలానికి టెండర్లు పిలిస్తే పని విలువ రూ.55లక్షల 2వేలు దాటిపోతుం ది. తప్పనిసరిగా ఆన్‌లైన్ టెండ ర్లు పిలవక తప్పదు. అదే మం డలంలోని గుడివాడ మంచి నీటి పథకానికి కూడా రెండు నెలల కాలపరిమితితో రూ. లక్షా 38వేలు విలువ నిర్ధారించి టెండర్లు పిలుస్తున్నారు. అదే సంవత్సర కాల పరిమితితో పిలిచినట్టయితే నిర్దేశిత రూ.10లక్షలు దాటిపోయి ఆన్‌లైన్ టెండర్ల జాబితాలోకి వెళ్లిపోయేది. ఇవే కాదు. జిల్లాలో భారీ మంచినీటి పథకంగా పరిగణిస్తున్న చీపురుపల్లి మంచినీటి పథకం విషయంలో కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. రూ.10లక్షల పని విలువగా నిర్ధారించి, నెల కాల పరిమితితో టెండర్లు పిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో టెండర్లు పిలిచారు.
 
  ప్రస్తుతం చలామణిలో ఉన్న జీవో ప్రకారం  పని విలువ రూ.10లక్షలు దాటితే ఈ ప్రొక్యూర్‌మెంట్(ఆన్‌లైన్) ద్వారా టెండర్లు పిలవాలి. రాష్ట్రంలో ఎక్కడి వారైనా టెండర్లు వేసుకోవచ్చు. దీనివల్ల పోటీ పెరుగుతుంది. ఆ పనులు దక్కించుకోవాలంటే స్థానిక నేతలకు అంత సులువు కాదు. ఇతర ప్రాంతాల వారిని మేనేజ్ చేస్తే తప్ప దక్కించుకోలేరు. అదే పని విలువ రూ.10లక్షల లోపు ఉంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయిలో టెండర్లు పిలవొచ్చు. జిల్లాలో ఎలాగోలా మేనేజ్ చేసి పనులు దక్కించుకోవచ్చు. దీనికేం చేయాలో ప్రస్తుత నేతలు ఆలోచించారు. కాల పరిమితిని తగ్గించినట్టయితే   పని విలువ తగ్గిపోతుందని గుర్తించారు. ఈ సూత్రానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఆన్‌లైన్ టెండర్లలోకి వెళ్లకుండా పనుల కాల పరిమితిని విడగొట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఖరారైన కాంట్రాక్టర్లకే వచ్చే ఆర్థిక సంవత్సరం నిర్వహణ బాధ్యతలు  కూడా అప్పగించే వ్యూహమని విమర్శలొస్తున్నాయి.  అందుకనే  నెలల కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకునేందుకు బెదిరింపులు, హెచ్చరికలతో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు.  
 
 వ్యూహాత్మక ఎత్తుగడ
  ఈవిధంగా  భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులు దక్కించుకునేందుకు అధికార పార్టీ సరికొత్త ఎత్తుగడ వేసింది.  గత కొంత కాలంగా నామినేటేడ్‌గా నిర్వహణ పనులు చేపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక వైఖరితో ముందుకెళ్లింది. అందుకు అధికారులను వాడుకుంటోంది. దీంతో ఆ పనుల టెండర్లు జిల్లాకే పరిమితం అయిన పరిస్థితి ఏర్పడింది.
 
 టెండర్లలో  అస్మదీయులే పాల్గొనాలని హుకుం
  అస్మదీయులు తప్ప మరెవ్వరూ టెండర్లలో పాల్గొనకుండా బెదిరింపులకు దిగడం, బెదిరింపుల్ని బేఖాతరు చేసి, టెండర్లు వేసేందుకు ముందుకొచ్చే వారు తర్వాత ఇబ్బంది పడతావని అధికారుల చేత హెచ్చరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడి భారీ మంచినీటి పథకాల నిర్వహణ కాంట్రాక్ట్‌లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు..  ఇప్పటికే కొన్ని మంచినీటి పథకాల కాంట్రాక్ట్‌ల్ని దక్కించుకోగా, మరికొన్ని దక్కించుకునేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ముఖ్యంగా గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో ఈ తంతు ఎక్కువగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులకు కట్టబెట్టేందుకే ఈ రకంగా వ్యవహరించారన్న వాదనలు ఉన్నాయి. భోగాపురంలో కూడా రాజకీయాలకు అతీతంగా టెండర్లు వేసేందుకు వెళ్లిన వారిని పలువురు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తమకే వదిలేయాలని, ఇందులో వేలి పెట్టొద్దని టెండర్లు వేసేందుకు వెళ్లిన కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు.నెల్లిమర్ల, చీపురుపల్లిల లో కూడా ఇదే జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది.  నిబంధనల మేరకైతే  ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సబ్ డివిజనల్ ఇంజినీర్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో టెండర్ల నోటిఫికేషన్ అతికించాలి. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు తీసుకోవాలి. ఆ తర్వాత టెండర్లు తెరవాలి. కానీ పలుచోట్ల ఆ ప్రక్రియ ఏదీ చేపట్టకుండా అధికార పార్టీ నేతలు ఒకరిద్దరిచ్చిన దరఖాస్తులతో పని కానిచ్చేసినట్టు విమర్శలు ఉన్నాయి.
 
   ఉన్నతాధికారుల భిన్న వాదన
 జిల్లాలో ఉన్న భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనుల కాంట్రాక్ట్‌లన్నీ ప్రస్తుతం ఎక్స్‌టెన్షన్‌లోనే కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందులో కొన్ని ఈనెలతో ఎక్స్‌టెన్షన్ గడువు ముగియనుండగా, మరికొన్నింటికీ వచ్చే నెలతో గడువు ముగియనుంది. ఇదే కాంట్రాక్టర్లకు ఈ మార్చి వరకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చేసి కొత్త కాంట్రాక్ట్‌లను పిలవొచ్చు. కానీ, అధికార పార్టీ నేతలు తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకని కొన్ని పథకాలకు నెల  కాల పరిమితితోనూ, మరికొన్ని పథకాలకు రెండు నెలలకని టెండర్లు పిలుస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు.
 
 తాత్కాలిక టెండర్లు లోగుట్టు ఇదేనా
 వాస్తవానికైతే, ఈ టెండర్ల ప్రక్రియ జిల్లా పరిషత్ చేపట్టాలి. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సాంకేతిక సహాయంతో టెండర్లు నిర్వహించాలి. కానీ జెడ్పీ అధికారులు అలా చేయకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌కే వదిలేశారు. భారం మోపారన్న కారణంగా 2015-16కి గాను పథకాల నిర్వహణ పనులకు మంజూరు ఇచ్చినట్టయితే టెండర్లు పిలుస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జెడ్పీకి రాశారు.కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం విషయాన్ని పక్కనబెట్టి తక్షణమే టెండర్లు పిలవాలని అక్కడ అధికారులు ఆదేశించారు. దీనివెనుక అధికార పార్టీ నేతల  వ్యూహాత్మక ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ఒకటి రెండు నెలలకు టెండర్లు ఖరారైతే వచ్చే అర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్స్‌టెన్షన్‌తో గడిపేయవచ్చని భావిస్తూ తాజా ఎత్తుగడ వేసినట్టు విమర్శలొస్తున్నాయి.
 
  కారణమేదైనా  మంచినీటి పథకాల నిర్వహణ పనులపై ఆధారపడి కొనసాగుతున్న రాజకీయేతర కాంట్రాక్టర్లు, ఇతర ఆశావహులు తమకు అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ గాయత్రిదేవిని ‘సాక్షి’ సంప్రదించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రెండు నెలలే ఉన్నాయని, ఈ బ్యాలెన్స్ నెలలకని ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. రూ.10లక్షలు దాటితే ఆన్‌లైన్ టెండర్లు పిలవాలని గత జీవో చెబుతోందని, ప్రస్తుత జీవోలో  రూ.50లక్షల వరకు తన పరిధిలో టెండర్లు పిలొచ్చని చెబుతూనే, ఆ కారణంగా ఆన్‌లైన్‌లో కాకుండా సాధారణ టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడి, మరే ఉద్దేశం లేదని వివరించారు. ఈ రెండు నెలల తర్వాత మళ్లీ టెండర్లు పిలుస్తారా? అని అడిగితే జెడ్పీ మంజూరు ఇస్తే తప్పకుండా కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు