పోటెత్తుతున వరదలు

9 Aug, 2019 03:59 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప వద్ద శివాలయంలోకి చేరిన వరద నీరు

కృష్ణా, గోదావరి పరవళ్లుశ్రీశైలంలో 173.06

టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

పోటాపోటీగా కృష్ణా, గోదావరి

శ్రీశైలంలోకి 3,71,014 క్యూసెక్కుల ప్రవాహం.. 173.06 టీఎంసీలకు నీటి నిల్వ

రేపు పలు గేట్లు ఎత్తే అవకాశం

వరద ప్రవాహం ఇలాగే ఉంటే వారం రోజుల్లో నిండుకుండలా సాగర్‌

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం నుంచి 13.62 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

వంశధార, నాగావళి తగ్గుముఖం ∙గొట్టా బ్యారేజీలో 22 గేట్లు ఎత్తివేత

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌ :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నాలుగురోజుల పాటు ఉగ్రరూపం ధరించిన గోదావరి గురువారం శాంతించినట్లు కనిపించి మళ్లీ ఉధృతమైంది. శ్రీశైలంలోనూ అంతకంతకూ వరదపోటు పెరిగిపోతుండడంతో శుక్రవారం జలాశయంలోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు కొంత శాంతించాయి. ఇక్కడ గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లను ఎత్తివేశారు.

గోదావరి మళ్లీ ఉగ్రరూపం
కాగా, నదీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో గురువారం మధ్యాహ్నానికి గోదావరి ఒక్కసారిగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 44.20 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరింది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటి మట్టం 28.15 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గురువారం ఉదయం ఆరు గంటలకు 9,96,503 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు ఆ ప్రవాహం 13,62,041 క్యూసెక్కులకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 14.25 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

రాత్రి 7 గంటలకు 14.30 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా, వరద పోటుతో దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలోని వైనతేయ గోదావరి నదీతీరంలోని లంక గ్రామాలను వరద మళ్లీ ముంచెత్తింది. రాజోలు నియోజకవర్గంలో వరద తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నంలో వరదనీరు మరోసారి పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెనపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

శాంతించిన వంశధార, నాగావళి
ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు గురువారం కొంత శాంతించాయి. గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లు ఎత్తేశారు. బ్యారేజీలోకి ఉదయం 1,12,210 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేసి అంతేస్థాయిలో ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టి రాత్రి 8 గంటలకు 70 వేల క్యూసెక్కులకు చేరింది. వరదల కారణంగా గార మండలంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జిల్లాలో మొత్తం 8.600 హెక్టార్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. 12మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

రేపు శ్రీశైలంలో పలు గేట్లు ఎత్తివేత?
కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి గురువారం రాత్రి ఏడు గంటలకు 3,71,014 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ల ద్వారా 96,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 877 అడుగుల్లో 173.06 టీఎంసీలకు చేరుకుంది.

వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే.. శనివారం శ్రీశైలం జలాశయంలోని నాలుగు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అలాగే, సాగర్‌లో ప్రస్తుతం 514.2 అడుగుల్లో 138.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది పూర్తిస్థాయిలో నిండాలంటే.. ఇంకా 174 టీఎంసీలు అసవరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్‌ జలాశయం నిండే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు