శ్రీశైలంలోకి భారీ వరద

17 Aug, 2018 03:19 IST|Sakshi
875 అడుగులకు చేరుకున్న శ్రీశైలం డ్యాం నీటి మట్టం

     తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద 

     వచ్చింది వచ్చినట్లు మొత్తం దిగువకు విడుదల

     దాంతో శ్రీశైలంలోకి 3,01,570 క్యూసెక్కుల ప్రవాహం.. 

     ఒడిశాలో కురిసిన వర్షాలకు ఉప్పొంగిన వంశధార, నాగావళి

     ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.52 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/రంపచోడవరం: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గురువారం మహారాష్ట్రలో మహాబళేశ్వర్, కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద ప్రవాహం చేరుతోంది. గురువారం రాత్రికి శ్రీశైలం జలాశయంలోకి 3,01,570 క్యూసెక్కులు వస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 875 అడుగుల్లో 163.20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. మరో 52 టీఎంసీలు వస్తే శ్రీశైలం జలాశయం నిండుతుంది. శుక్రవారం నాటికి ఎగువ నుంచి శ్రీశైలానికి 3,06,169 క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నివేదికలో పేర్కొంది. శ్రీశైలం జలాశయం పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేసిన వరద నీరు 73,912 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌లోకి చేరుతున్నాయి.

ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర 
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 2,09,319 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 2,16,040 క్యూసెక్కులు వదులుతున్నారు. కర్నూల్‌ జిల్లా మంత్రాలయంలో అధికారులు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సుంకేసుల బ్యారేజీలోకి కూడా 1,81,066 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,78,712 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి గురువారం సా.6 గంటలకు 13,850 క్యూసెక్కుల వరద రాగా.. ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేశారు. అలాగే, ఉత్తరాంధ్రలోని వంశధార కూడా ఉప్పొంగింది. గురువారం సా.6 గంటలకు 44,189 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలారు. నాగావళి కూడా పొంగిపొర్లుడడంతో తోటపల్లి బ్యారేజీ నుంచి దిగువకు 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం 4,52,855 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. అలాగే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పలు వాగులు రహదారులపై నుంచి పెద్దఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా గురువారం ఆంధ్రా నుంచి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన గోదావరికి భారీగా వరద వస్తుండడంతో శబరి నది ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాన రహదారులపై నుంచి సుమారుగా పది అడుగుల మేర నిలిచి ఉంది. దీంతో పలు పంచాయితీల్లోని 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  

మరిన్ని వార్తలు