పోటెత్తిన కృష్ణమ్మ.. అందాల ఒడిలో శ్రీశైలం

11 Aug, 2019 11:56 IST|Sakshi

శ్రీశైలం నుంచి  పది గేట్ల ద్వారా 7,86,752క్యూసెక్కుల నీటి విడుదల 

ప్రాజెక్టుకు పర్యటకుల తాకిడి

శ్రీశైలం: కృష్ణానది పోటెత్తుతోంది. తుంగభద్ర కూడా తోడైంది. శ్రీశైలం డ్యాంలోకి వరద ప్రవాహం భారీగా ఉండడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 7,86,752 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే తుంగభద్ర జలాశయంలోకి నీటి చేరిక పెరగడంతో రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో 28 గేట్లు ఎత్తి 75,464 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. జలాశయానికి 7.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..దిగువకు 7.61లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 62 గేట్లకుగానూ..60గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. శ్రీశైలం అందాలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

శ్రీశైలానికి పోటెత్తిన వరద 
జూరాల ప్రాజెక్ట్‌ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి  6,61,760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది.

మరిన్ని వార్తలు