కర్నూలు జిల్లాలో ముంచెత్తిన వరద

17 Sep, 2019 14:33 IST|Sakshi

జల దిగ్బంధంలో గ్రామాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

సాక్షి, కర్నూలు: నంద్యాల రెవెన్యూ డివిజన్‌ నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల తదితర మండలాలను వరద ముంచెత్తింది. కర్నూలు జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి సహాయక చర్యలను కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి నిరంతరం సమీక్షిస్తున్నారు. మహానంది మండలం తమడ పల్లె, నంది పల్లె, సూర్యనంది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహానంది, సంజామాల, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.

నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో ఆకస్మిక వరదలతో నీటమునిగిన పంట నష్టాన్ని లెక్కించాలని జేడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. వరద ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నదులు, వాగులు, వంకలు, వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్లను దాటే ప్రయత్నం చేయొద్దని  ప్రజలకు కలెక్టర్‌ సూచించారు. వాన నీటితో నానిన పాత గోడలు, పిట్ట గోడలు, చెట్ల కింద ఉండకుండా.. స్థానిక పోలీసు,రెవెన్యూ అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని తెలిపారు. వరద సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08518-277305లో సంప్రదించాలన్నారు. (చదవండి: జల దిగ్బంధనంలో మహానంది ఆలయం)


 

మరిన్ని వార్తలు