వణుకుతున్న నంద్యాల

21 Sep, 2019 08:17 IST|Sakshi
పద్మావతినగర్‌లో రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపునీరు

శాంతించని వరుణుడు

ఉప్పొంగిన కుందూ, మద్దిలేరు

పట్టణాన్ని చుట్టుముట్టిన వరద

లోతట్టు ప్రాంతాలు జలమయం 

సాక్షి, నంద్యాల: నంద్యాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వరుణుడు తెరిపిస్తున్నట్లు కనిపించాడు. వరద తగ్గుముఖం పడుతుంది... పట్టణం, చుట్టు పక్కల గ్రామాల్లో చేరిన నీరు ఇప్పుడిప్పుడు బయటకు వెళ్లిపోతుంది.. అని ప్రజలు అనుకుంటున్న సమయంలో శుక్రవారం మరోసారి వరదనీరు నంద్యాల పట్టణాన్ని ముంచెత్తింది. ఐదు రోజులుగా నంద్యాలలో కురుస్తున్న వర్షాలకు తోడు నల్లమలలోని ఫారెస్ట్‌ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది.


వరద నీటి చేరికతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు 

దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్,  బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్‌జీఓ కాలనీ, ఎస్‌బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. పెద్దకొట్టాల, దీబగుంట్ల గ్రామాల్లో వర్షపునీరు చేరి ఇళ్లు అని జలమయమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసే అవకాశం ఉందని   నది తీర గ్రామాలైన భీమవరం, చాపిరేవుల, పుసులూరు, గుంతనాల, తేళ్లపురి, కూలూరు, రాయపాడు ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  వరుణుడు శాంతించక పోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది.

వరద బాధితులు శిబిరాలకు తరలింపు
పట్టణంలోని శ్యాంమకాల్వ, మద్దిలేరువాగు, కుందూనదిలకు భారీగా వరదనీరు వస్తుండటంతో వరదముంపు ఉన్న ప్రజలను పట్టణంలో ఏర్పాటు చేసిన ఏడు వరద బాధిత శిబిరాలకు తరలించారు. పక్కిర్‌పేట, హరిజనపేట, సాయిబాబానగర్, శ్యామకాల్వ వద్ద ఉన్న బాధితులను కేంద్రాలకు తరలించి భోజన సౌకర్యాలు, బస వసతి ఏర్పాటు చేశారు. పట్టణంలోని పక్కిర్‌పేట, సాయిబాబానగర్, దేవనగర్, శ్యామకాల్వ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వారిని అప్రమత్తం చేశారు. 

మహానంది ఆలయంలోకి మళ్లీ వరద నీరు
 

ముఖమండపం వరకు చేరిన వరద నీరు 
మహానంది:  మహానంది పుణ్యక్షేత్రంలోని ముఖమండపం వరకు మళ్లీ వరద నీరు చేరింది. మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి  ఆలయం బయట ఉన్న రెండు చిన్నకోనేరులు నీట మునిగాయి. నల్లమలలో సైతం భారీగా వర్షం కురవడంతో వరద నీరు రాజగోపురం నుంచి ముఖమండపం వరకు నీళ్లు ప్రవహించడంతో పాటు ఆలయంలోని రెండు చిన్న కోనేరులు కనిపించకుండా నీటితో నిండిపోయాయి. తెల్లవారు జామున 5.30 గంటల నిమిషాల నుంచి వర్షపునీరు ఆలయంలోకి చేరింది. వర్షం తగ్గడంతో ఉదయం పది గంటల నుంచి నీటి చేరిక తగ్గుముఖం పట్టింది. 
చదవండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా