జల దిగ్బంధం

17 Sep, 2019 08:20 IST|Sakshi

నంద్యాల డివిజన్‌లో భారీ వర్షాలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు 

తెగిపోయిన రహదారులు

స్తంభించిన జనజీవనం

14వేల హెక్టార్లలో నీట మునిగిన పంటలు 

సాక్షి, నంద్యాల: భారీ వర్షాలతో నంద్యాల రెవెన్యూ డివిజన్‌ అతలాకుతలమైంది. వాగులు, వంకలు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనజీవనం స్తంభించి పోయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జామున ప్రజలు నిద్రలేచే సమయానికి ఇళ్లలోకి నీరు వచ్చింది.

బయటకు వెళ్లి చూస్తే కనుచూపు మేర నీళ్లే కనిపించాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ఇన్‌చార్జి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి..గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టంది. ప్రధానంగా ఎనిమిది మండలాల్లో కుంభవృష్టి కురిసింది. వివిధ గ్రామాల్లో పాఠశాలలు నీటిలో చిక్కుకపోవడంతో స్థానిక సెలవు ప్రకటించారు. 


ఉయ్యాలవాడ మండలం ఆర్‌.పాంపల్లె సమీపంలో నీట మునిగిన పత్తి పంట 

జలవలయంలో చిక్కుకున్న గ్రామాలు.. 
ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లాయి. పడకండ్ల, నల్లగట్ల, బత్తులూరు, నందింపల్లి, బృందావనం, గూబగుండం, జి.కంబలదిన్నె గ్రామాలు జలమయం అయ్యాయి. వందాలాది ఇళ్లలోకి నీరు వెళ్లడంతో ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లి, కొలుగొట్లపల్లి, రాంపల్లి, అవులపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాగలమర్రిలోని చెంచుకాలనీ, కంచెపురికాలనీల్లో అనేక ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. గోస్పాడు మండలంలోని యూళ్లూరు, జిల్లెల్ల, నెహ్రూనగర్‌ పసురపాడు, చింతకుంట, గోస్పాడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.


గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో ఇంటిలోకి చేరిన వరద నీరు 

మహానంది మండలం తిమ్మాపురం, అబ్బీపురం, గోపవరం, గాజులపల్లి గ్రామాల్లోని వర్షపునీరు ముంచెత్తింది. రుద్రవరం మండలంలోని నాయుడుపల్లి, ఆర్‌.కొత్తూరు, మాచినేనిపల్లి, వరికొట్టూరు, చిన్మయస్వామి చెంచుగూడెం జలదిగ్బంధంలో చికుక్కున్నాయి. కుందూ నదీ, వాగులు వంకల నీరు ఉయ్యలవాడ మండలాన్ని ముంచెత్తాయి. దీంతో  బోడెమ్మనూరు, హరివరం, ఉయ్యలవాడతోపాటు మరో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిరువెళ్ల మండలంలోని అత్యధిక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోయాయి. నంద్యాల మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. గోస్పాడు మండలంలో ముంపు పరిస్థితిపై ఇన్‌చార్జీ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సమీక్షించారు. కుండపోత వర్షాలు పడిన మండలాల్లో పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఇన్‌చార్జీ కలెక్టర్‌ వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ గ్రామాల్లో బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేయూత ఇచ్చారు. 


గోస్పాడు మండలం నెహ్రూనగర్‌ వద్ద వరదనీటితో తెగిపోయిన రహదారి  

బాధితులకు భోజన సౌకర్యం.. 
వరద ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామస్థాయి నాయకులు కూడా ప్రజలకు సహకరించాలని సూచించారు. దీంతో వరద ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.  

అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌చార్జి కలెక్టర్‌ 
రానున్న మూడు రోజులలో రాయలసీమలో, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపాలిటీలోని అన్ని శాఖల అధికారులు, వారు పని చేస్తున్న కేంద్రాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ డీఆర్‌ఓ, కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానమై అప్రమత్తంగా ఉంటూ విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన సమాయక చర్యలను వెంటనే చేయాలన్నారు.  

రైతులూ..ఆందోళన చెందవద్దు.. 
పంట నష్టం జరిగిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భరోసాను ఇచ్చారు. యాళ్లూరు గ్రామంలో వరద ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా వెంటనే తాగునీటిని పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుతం నీరు అధికంగా ప్రవహిస్తున్నందున వాగులు, వంకలు, నదులు దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని సూచించారు. భారీ వర్షం సమయంలో చెట్లకింద, పాత గోడలు, పిట్టగోడలు సమీపంలో ఎవరూ ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.   

మరిన్ని వార్తలు