భగ్గుమంటున్న భానుడు

24 May, 2016 12:15 IST|Sakshi

విశాఖపట్నం:  రోహిణి కార్తె తడాఖా ఒకరోజు ముందుగానే మొదలైంది. వాస్తవానికి మంగళవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. రోహిణి కార్తెలో రోళ్లు బద్ధలవుతాయన్నది సామెత. అందుకుతగ్గట్టుగానే తీవ్రత చూపుతోంది. వారం కిందట వచ్చిన రోను తుపాను ప్రభావంతో ఈ ఏడాది రోహిణి కార్తె ప్రభావం అంతగా ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు తొలుత అంచనా వేశారు. అందుకు విరుద్ధంగా సోమవారం ఒక్కసారిగా భగ్గుమంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజనులో ఎన్నడూ లేనివిధంగా నగరంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు అధికం కావడం విశేషం. ఈ సీజనులో ఇప్పటిదాకా 39 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఇప్పటిదాకా విశాఖలో 1995 జూన్ 9న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. 2012 జూన్ 2న 44 డిగ్రీలు, మే 25, 2015న 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక సోమవారం జిల్లాలో గరిష్టంగా పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాంబిల్లిలో 45, పాయకరావుపేట 44.5, యలమంచిలి, నక్కపల్లిలో 43, అనకాపల్లిలో 42.4, చోడవరంలో 42  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాతో పాటు నగరంలోనూ వడగాడ్పులు తీవ్రంగా వీచాయి. ఉదయం నుంచీ వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలైనా ఉష్ణతాపం చల్లారలేదు. బస్సుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన వడగాడ్పుల తీవ్రతను తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. వాహన చోదకులు నరకాన్ని చూశారు. జనం ఇళ్లలో ఉన్నప్పటికీ వేడితీవ్రతను అనుభవించారు. ఒక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చిన వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారు మధ్యాహ్నానికే ఇంటిముఖం పట్టారు. జనసంచారం లేక రోడ్లన్నీ కర్ఫ్యూను తలపించాయి.

 
మరో రెండ్రోజులు మంటలు..

మరో రెండ్రోజులు వడగాడ్పులు కొనసాగుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వీస్తున్న పొడి, వేడిగాలుల వల్లే వడగాడ్పులు ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావడం మంచిదని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 

మరిన్ని వార్తలు