విశాఖకు భారీ పరిశ్రమలు రావు: లోకేష్‌

25 Aug, 2017 18:14 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి లోకేష్‌

భూముల కొరత తీవ్రంగా ఉంది
రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు


సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. విశాఖలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక్క విశాఖలోనే గత మూడేళ్లలో 40 ఐటీ కంపెనీలు ముందుకొచ్చినా వాటికి భూములు కేటాయించలేని దుస్థితి నెలకొందని, దీంతో విశాఖకు చెందిన ఐటీ రంగ నిపుణులు హైదరాబాద్, బెంగుళూరు వంటి సిటీలకు తరలి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ రేసపువానిపాలెంలో ఎనిమిది ఐటీ కంపెనీలతో ఏర్పాటుచేసిన టెక్‌హబ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం పోర్టు గెస్ట్‌హౌస్‌లో ఐటీ పరిశ్రమలకు అనువైన భూములు, మౌలిక వసతుల కల్పన, స్మార్ట్‌ సిటీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. పార్క్‌ హోటల్‌లో ఐటీ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ... రానున్న రెండేళ్లలో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో సమగ్ర ఐటీ పర్యావరణ అభివృది కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నామని, వాటిలో 70 వేల ఉద్యోగాలు విశాఖలోనే కల్పించబోతున్నామని తెలిపారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా 2018 కల్లా 50 లక్షల ఫైబర్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

టెక్‌హబ్‌లో పాత్రా బీపీవో ఇండియా సర్వీసెస్‌ కంపెనీ రెండువేల ఉద్యోగాలు, డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ కంపెనీ 1500 ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సలహాదారులు రవికుమార్‌ పి వేమూరి, సీఈవో సాంబశివరావు, ఏపీ ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ ప్రమోషన్‌ సీఈవో సీహెచ్‌ తిరుమలరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జేసీ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు