భగ్గుమన్న ధరలు

14 Oct, 2014 01:44 IST|Sakshi
భగ్గుమన్న ధరలు

పాల ప్యాకెట్ ధర రెట్టింపు కూరగాయలు, పళ్ల ధరలూ అంతే
 పెట్రోలు బంకుల ఎదుట బారులు సరిపడా నిల్వలున్నాయ్: చమురు పరిశ్రమ

 
విశాఖపట్నం, విశాఖ రూరల్: తాత్కాలికమే అయినా తుపాను దెబ్బకు సరఫరాలు తగ్గిపోవటంతో పాల నుంచి పప్పు వరకు అన్ని ధరలూ ఒకేసారి భగ్గుమన్నాయి. రోడ్లపై అడుగడుగునా చెట్లు పడిపోవడంతో పాల వ్యాన్లు రాలేదు. దీంతో ప్రజలు కాలినడకనే తెగిపడిన చెట్లను దాటుకుంటూ ప్యాకెట్ల కోసం వెతుకులాడారు. దీంతో రూ.22 ప్యాకెట్‌ను రూ.40కి విక్రయించటం కనిపించింది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ధరకు కూడా విక్రయించినట్లు తెలిసింది. ఇళ్లలో మంచినీరు సైతం లేకపోవడంతో టిఫిన్లు కూడా చేసుకొనే అవకాశం లేక బయటపెట్టిన తోపుడు బళ్లనే చాలామంది ఆశ్రయించారు. డిమాండ్ పెరగటంతో అక్కడా ధరల బాధ తప్పలేదు.

ఆఖరికి పూర్ణామార్కెట్‌లో సైతం పళ్లు, కూరగాయల ధరలు బాగా పెంచేశారు. ఇక పెట్రోలు బంకుల వద్దనైతే చాంతాడు క్యూలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నానికి కొన్ని బంకులు మాత్రమే తెరవటంతో మళ్లీ దొరుకుతుందో లేదోనన్న రీతిలో జనం పెట్రోలు కోసం బారులు తీరారు. అయితే నగరంలో 15 రోజులకన్నా ఎక్కువ రోజులకు సరిపోయే పెట్రోలు, డీజిల్‌ను నిల్వ ఉంచామని, జనం భయపడి ఎక్కువ ఎక్కువ కొనాల్సిన పనిలేదని చమురు పరిశ్రమ రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అవసరమైనంత మేర కొనుక్కుంటే చాలునని, దెబ్బతిన్న బంకుల్ని యుద్ధ ప్రాతిపదికన పునుద్ధరించడానికి చమురు కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు