కరువు తీరా వాన

21 Jun, 2015 01:35 IST|Sakshi
కరువు తీరా వాన

- విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం
- వాయుగుండంతో నేడూ, రేపూ ప్రభావం
- అధికార యంత్రాంగం అప్రమత్తం
- మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరిక
- కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం:
మూడు రోజుల నుంచి వాన ముంచెత్తుతోంది. కరువు తీరా వర్షం కురుస్తోంది. ఒక్కరోజూ వదలకుండా వాన ఇక చాలు అన్నంతగా దంచికొడుతోంది. నైరుతి రుతుపవనాల్లో చురుకుదనానికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తోడైంది. ఫలితంగా కుంభవృష్టిని తలపిస్తోంది. జనజీవనాన్ని స్తంభింపచేస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధిని హరిస్తోంది. కుండపోతగా కురిస్తే ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉండిపోయి పల్లపు ప్రాంతాలను జలమయం చేస్తుంది. కానీ ఏకధాటిగా కాకుండా కాస్త విరామం ఇస్తూ కురుస్తుండడం వల్ల ఒకింత ఊరటినిస్తోంది. లేదంటే  ఇంతటి భారీ వర్షపాతానికి ఎంతో నష్టం వాటిల్లేది.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఈ సీజనులో ఇదే అత్యధిక వర్షం కావడం విశేషం. నగరంతో పాటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నక్కపల్లిలో 10 సెం.మీలు, ఏజెన్సీలోని పెదబయలులో 7.5 సెం.మీల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు మైదానంలోనూ, మన్యంలోనూ వాగు లు, వంకలు పొంగుతున్నాయి. నదుల్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాండవ, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వానలకు కొన్నిచోట్ల చెరకు, మెట్టు పంటలు దెబ్బతిన్నాయి. కశిం కోట మండలంలో కాశీమదుం గ్రోయిన్ కొట్టుకుపోయింది.

ఏజెన్సీలోని మత్స్యగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ఇతర గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో మన్యంలో గిరిజనులు నాటుపడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అనూహ్యంగా కురుస్తున్న వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలోకి ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇదే ఇప్పుడు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
 
నేడు, రేపు కూడా..
మరోవైపు ఉత్తరాంధ్రపై రుతుపవనాలు చురుగ్గా ఉండడం, వాయుగుండం ప్రభావం వెరసి ఆది, సోమవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వానలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. జిల్లాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద సూచికను జారీ చేసింది.

మరిన్ని వార్తలు