ఉత్తర కోస్తాకు వరద ముప్పు

8 Sep, 2014 01:26 IST|Sakshi
ఉత్తర కోస్తాకు వరద ముప్పు

* పొంగుతున్న వంశధార, నాగావళి... గోదావరి ఉగ్రరూపం
 
నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలను వరద ముంపు వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువనున్న ఒడిశా, ఏజెన్సీ ప్రాంతాల్ల కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార, నాగావళి భారీగా వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఆయా నదుల తీర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.

వంశధార నదిలో నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకోవడం, నాగావళి నదిలో కూడా నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండవాగులు, గెడ్డల ఉధృతికి ఏజెన్సీలో పలు గ్రామాలతో రాకపోకలు తెగిపోయాయి.

శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి, విశాఖ జిల్లాలో మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారు. 30 గేదెలు కొట్టుకుపోయాయి. ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, శబరితో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.  ధవళేశ్వరం బ్యారేజీ అన్ని గేట్లనూ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  భద్రాచలం వద్ద గోదావరి గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి 50 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జలదిగ్బంధంలో సిక్కోలు గ్రామాలు
శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు వరద ఉద్ధృతి పెరగడంతో 11 మండలాల పరిధిలోని 124 గ్రామాలు ప్రమాదం అంచున ఉన్నాయి. ఇప్పటికే ఈ మండలాల్లోని వేలాది ఎకరాల వేసిన అరటి, మొక్కజొన్న, వరి, చెరుకు తదితర పంటలు నీట మునిగాయి.

వరదలపై అప్రమత్తం: సీఎం ఆదేశం
వరదలు పోటెత్తుతున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశాతో పాటు పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని పరిస్థితిపై సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

మరిన్ని వార్తలు