ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

22 Oct, 2019 10:40 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర-ఉత్తర తమిళనాడు మధ్య అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడిన చోటు నుంచి ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

అలాగే బుధ, గురు వారాల్లో కూడా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోని వాగులు, వంకలు, నదులు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపిన ఆర్టీజీఎస్‌.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు