నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన 

15 Jul, 2020 03:41 IST|Sakshi

కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం

సాక్షి,విశాఖపట్నం: సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్‌ జోన్‌) ప్రభావం రాష్ట్రంపై సాధారణంగా కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి. 

వీటన్నింటి ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉత్తర కోస్తా, యానాం పరిసరప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 18వ తేదీన రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరువూరులో 17 సెం.మీ, విశాఖపట్నంలో 10 సెం.మీ, చోడవరంలో 8 సెం.మీ, ధవళేశ్వరంలో 7 సెం,మీ, పిడుగురాళ్ల, తణుకు, కందుకూరులో 6 సెం.మీ, బద్వేల్, ఆత్మకూరు, అవనిగడ్డ, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, సంతమాగులూరు, బొబ్బిలిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

>
మరిన్ని వార్తలు