వరుణుడు తెచ్చిన కష్టం!

19 Sep, 2018 10:14 IST|Sakshi

వరుణుడు నగరాన్ని ముంచెత్తాడు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్థంభించింది. ఫలితంగా నగర వీధులు చెరువులను తలపించాయి. డ్రెయిన్లు, అంతర్గత కాలువలు పొంగిపొర్లాయి.  అరండాలపేట ప్రధాన రహదారితో పాటు, బ్రాడీపేట 1,2,3,4 లైన్ల, రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో పలువురు గుంతల్లోపడి గాయపడ్డారు. దీంతో స్థానికులే ఆ రహదారిపై వాహనాలు రాకుండా తాళ్లు కట్టి రక్షణ ఏర్పాట్లు చేపట్టారు.  నందివెలుగు రోడ్డు, మూడు వంతెనల ప్రాంతం వద్ద వాహనదారులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు రైల్వే స్టేషన్‌ అరండాలపేట మొదటి లైను వైపు ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ పోల్‌ విరిగిపోయింది. పలు ప్రాంతాల్లో  చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్‌ రద్దీ రాత్రి 8.00 గంటల వరకు కొనసాగింది. వర్షం కారణంగా ముందస్తు చర్యలో భాగంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కాకుమాను మండలంలోని గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురవటంతో రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లింది. ఎంపీడీవో కార్యాలయం, పంచాయతీ, ఎంఈవో కార్యాలయాల మార్గాలు నీటితో మునిగిపోయాయి. కాకుమాను, బీకేపాలెం గ్రామాల మధ్య విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. 
–కాకుమాను/
సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు

మరిన్ని వార్తలు