ముంచెత్తిన వాన

20 May, 2016 02:59 IST|Sakshi
ముంచెత్తిన వాన

అనంత, ఉభయగోదావరి జిల్లాల్లో
ఆరుగురు మృతి పండ్ల తోటలకు అపార నష్టం

 సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పిడుగుపాటు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనంతపురం జిల్లా కంబదూరు, బత్తలపల్లి, కనగానపల్లి, పెనుకొండ మండలాల్లో కళింగర, కర్బూజా, బొప్పాయి, వరి పంటలు దెబ్బతిన్నాయి. రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కృష్ణా జిల్లాలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో మామిడి, అరటితోటలు దెబ్బతిన్నాయి.

రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మచిలీపట్నం, అవనిగడ్డలలో సిద్ధంగా ఉంచారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం వరకు 102.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా చీరాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్‌లో గురువారం కుండపోత వర్షం వల్ల బి.కొత్తకోట-మదనపల్లె మార్గంలోని కల్వర్టువద్ద నీరు రోడ్డుపై నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో తోటపల్లి నీరు వెళ్లేందుకు కాలువపై నిర్మించిన కల్వర్టు కుప్పకూలింది. విజయనగరం జిల్లా పూసపాటి రేగ, భోగాపురం ప్రాంతాల్లో 20 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.

 పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ..
విశాఖ జిల్లా ఏజెన్సీలోని బొర్రాగుహలు-చిముడుపల్లిల మధ్య గురువారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో కిరండూల్ నుంచి విశాఖపట్నానికి ఐరన్ ఓర్ లోడుతో వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ రైలుకు చెందిన మూడు ఇంజన్లు, రెండు వ్యాగన్లు దెబ్బతిన్నాయి. దీంతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లా తిరుపతి నుండి తిరుమలకు వళ్లే రెండో ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన వర్షానికి 9వ కిలోమీటరు వద్ద పెద్ద స్థాయిలో బండరాళ్లు దొర్లిపడ్డాయి.

విద్యుత్‌పై ‘రోను’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం/అమలాపురం: ‘రోను’ తుపాను రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టింది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు వీస్తుండడం, వర్షాలు కురుస్తుండడంతో భారీ వృక్షాలు కూలిపోతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి.  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 14 లక్షల గృహాల్లో కారు చీకట్లు అలుముకున్నాయి. దాదాపు 1.5 లక్షల నివాసాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 114 గ్రామాల్లో కరెంటు జాడే లేదు. లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.

 ఉభయ గోదావరి జిల్లాల్లో ..
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం కూడా కుండపోత వర్షం కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. డెల్టాలోని పాలకొల్లు, ఆచంట, నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. విద్యుత్ శాఖకు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లింది. అమలాపురంలో అత్యధికంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారి మూడు మీటర్ల ఎత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతోంది. అల్లవరం మండలం ఓడలరేవు, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, రామేశ్వరంలో సముద్రం మూడు మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది.  డెల్టాలో మూడో పంటగా సుమారు 16 వేల ఎకరాల్లో సాగైన అపరాల పంటకు నష్టం వాటిల్లింది.

మరిన్ని వార్తలు