గుంటూరుజిల్లా అంతటా జోరువాన

13 Sep, 2013 04:03 IST|Sakshi
సాక్షి, గుంటూరు : జిల్లా అంతటా గురువారం జోరువాన కురిసింది. మధ్యస్త బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ముసురు పట్టింది. గుంటూరు నగరంతోపాటు తెనాలి, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట పట్టణాలు తడిసి ముద్దయ్యాయి.  జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరులో మధ్యాహ్నం 12 గంటల నుంచి  విడతలవారీగా కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం 1.30నుంచి మూడు గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురి సిన వర్షానికి నగరంలోని పలురోడ్లు జలమయమయ్యాయి.   
 
 వివిధ ప్రాంతాల్లో రోడ్లపై అడుగులోతున నీరు నిలబడింది. వాహనాల రాకపోకలు కష్టమయ్యాయి. డొంకరోడ్డులో రెండుకార్లు వర్షపునీటిలో ఇరుక్కుపోయి గంటన్నరపాటు మూడు వంతెనల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు శివారునున్న వెంకటప్పయ్యకాలనీ, భాగ్యనగర్‌కాలనీ, చుట్టుగుంట, రామిరెడ్డినగర్, స్వర్ణాంధ్రనగర్, పలకలూరు రోడ్లల్లోని లోతట్టు కాలనీల్లోకి వర్షపునీరు చేరింది.  తెనాలి డివిజన్‌లోని వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాలపరిధిలో ఉన్న చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, చందోలు, పిట్లవానిపాలెం మండలాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. తెనాలి పట్టణంలోని పూలేకాలనీ, నరేంద్రదేవ్‌కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ లు జలమయమయ్యాయి. నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. నరసరావుపేట- కోటప్పకొండదారిలోని యల్లమంద గ్రామసమీపంలో ఉన్న మందలపువాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.
 
 కుప్పగంజి, ఓగేరు వాగుల్లో నీరు ప్రమాదస్థాయికి చేరింది. ఎద్దువాగు పొంగిన కారణంగా పాపాయపాలెం-పిడుగురాళ్ల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోనూ సుమారు 4 సెంటీమీటర్ల వాన పడింది. కొండూరు, నిండుజర్ల గ్రామాల సరిహద్దుల్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. 
 
 పిడుగులు పడి.. ముప్పాళ్ల మండలం నార్నెపాడు, తురకపాలెం, చాగంటివారిపాలెం, బొల్లవరం, నాదెండ్ల మండలం సాతులూరు, అచ్చంపేట మండలం నిండుజర్ల, రొంపిచర్ల మండలం విప్పర్ల, పెదకూరపాడు ప్రాంతాల్లో పిడుగులు పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. సత్తెనపల్లి, క్రోసూరు ప్రాంతాల్లోని ఎద్దువాగు, బసమ్మవాగుల్లో భారీగా వర్షపునీరు చేరింది.  కృష్ణాపశ్చిమ డెల్టా ప్రాంతం, పల్నాడు ప్రాంతాల్లో  ప్రధాన కాల్వల్లోని నీటి పరిమాణం బాగా పెరిగింది. 
 
మరిన్ని వార్తలు