జిల్లాకు తీవ్ర వాయు‘గండం’

16 Nov, 2013 08:29 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు తీవ్ర వాయుగుండం హెచ్చరిక వచ్చింది. చెన్నై-నాగపట్నంల మధ్య శనివారం సాయంత్రం వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08592 281400)ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్(1077)ను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వీలుగా తీర ప్రాంత మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా యంత్రాంగం కోరింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సంకేతాలు పంపించింది. అక్టోబర్‌లో పై-లీన్ తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నెలరోజులు తిరక్కముందే తీవ్ర వాయుగుండం రూపంలో జిల్లాకు హెచ్చరికలు వచ్చాయి.
 
 జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలు, వాటి పరిధిలో 72 మత్స్యకార గ్రామాలున్నాయి. తీవ్ర వాయుగుండం చెన్నై-నాగపట్నంల మధ్య తీరం దాటే సమయంలో  తీర ప్రాంత మండలాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు, జరుగుమల్లి మండలాలకు జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. తీర ప్రాంతాల్లోని తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. బియ్యం, కిరోసిన్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
 
 తీరప్రాంత స్పెషలాఫీసర్లు వీరే:
 అధికారి పేరు    మండలం పేరు
 ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌కుమార్    చినగంజాం
 డ్వామా పీడీ పోలప్ప    చీరాల
 గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర    కొత్తపట్నం
 భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు    నాగులుప్పలపాడు
 డీఆర్‌డీఏ పీడీ పద్మజ    ఒంగోలు
 ఉద్యానవన శాఖ ఏడీ-1 రవీంద్ర    సింగరాయకొండ
 హౌసింగ్ పీడీ ధనుంజయ    టంగుటూరు
 సివిల్ సప్లయిస్ విజిలెన్స్ ఎస్‌డీసీ భక్తవత్సలరెడ్డి    ఉలవపాడు
 డీఆర్‌డీఏ అడిషినల్ పీడీ రామచంద్రరావు    వేటపాలెం
 కోనేరురంగారావు కమిటీ ఎస్‌డీసీ శ్రీనివాసరావు    జరుగుమల్లి
 వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా    గుడ్లూరు
 
 అప్రమత్తంగా ఉండాలి : జేసీ
 జిల్లాకు వాయుగుండం హెచ్చరికలు రావడంతో అందుబాటులో ఉన్న స్పెషల్ ఆఫీసర్లతో శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ తన చాంబర్‌లో  సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.  సమావేశంలో డీఆర్వో జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, గుండ్లకమ్మ ప్రాజెక్టు(యూనిట్-3) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పీ గ్లోరియా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు