గాలి వాన బీభత్సం

3 Jun, 2014 01:05 IST|Sakshi

 కోవెలకుంట్ల, న్యూస్‌లైన్:  వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉండటం, విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పెనుగాలలతో కూడిన భారీవర్షం కురిసింది. గుళ్లదూర్తి, పొట్టిపాడు, కంపమల్ల, హరివరం, అల్లూరు, తదితర గ్రామాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో పొలాల్లో వర్షపు నీరు చేరింది. పెనుగాలుల కారణంగా కోవెలకుంట్ల- జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కురిసిన తొలకరి వాన రైతులకు ఊరట నిచ్చింది. వేసవికాలం కావడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

 నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
 ఆళ్లగడ్డటౌన్: ఆళ్లగడ్డ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, మహా వృక్షాలు నేలకొరిగాయి. ఫలితంగా వాహనాల రాక పోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర పంచాయతీ పరిధిలోని చింతకుంటలో కోవెలకుంట్ల మార్గంలో ఉన్న వందల సంవత్సరాల నాటి గుర్రమ్మమాను కూకటి వేళ్లతో సహా నేలకొరిగింది. ఆ సమయంలో రోడ్లపై ఎవరు లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు.  పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. అదృష్ట వశాత్తు ఆ సమయంలో విద్యుత్ సర ఫరా లేకపోవడంతో ఘోరప్రమాదం తప్పింది. చెట్టు విరగడంతో  వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 సంజామలలో పిడుగుపాటు
 కోవెలకుంట్ల రూరల్:   మండల కేంద్రం సంజామలలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది.  పెనుగాలుల వీస్తూ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో గ్రామంలోని బీసీ కాలనీలో వెంకటరామకృష్ణుడు, గాండ్లవెంకటరామయ్య, గొల్లసంజన్న ఇళ్ల మధ్య ఉన్న కంపచెట్లపై పిడుగుపడటంతో కాలనీవాసులు బెంబెలెత్తారు.

మరిన్ని వార్తలు