కోస్తాకు కుండపోత!

10 Jun, 2020 03:53 IST|Sakshi
గుంటూరులో జలమయమైన రోడ్డు

నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు: రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. బుధ, గురువారాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ‘బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయి ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉంది’ అని ఐఎండీ పేర్కొంది.  

► నైరుతి రుతు పవనాలు రాబోయే 36 గంటల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తాంధ్రలో ప్రాంతాలకు విస్తరించనున్నాయి. 
► నేడు, రేపు రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 
► గత 24 గంటల్లో విశాఖపట్నంలో 5 సెంమీ, ఎస్‌.కోట, అనకాపల్లి, అరకు, వేపాడలో 4 సెం.మీ, చోడవరం, భీమిలిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. 
► నేడు, రేపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. 
► గుంటూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు చెట్లు విరిగి పడి విద్యుత్‌ తీగలు తెగటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరులో భారీ వర్షం కురవటంతో ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు.

>
మరిన్ని వార్తలు