కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

8 Jun, 2020 20:34 IST|Sakshi

చురుగ్గా నైరుతి రుతుపవనాలు

సాక్షి, విశాఖ‌ప‌ట్నం: కోస్తాంధ్ర‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశాఖ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం తూర్పు మధ్య‌ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ‌కాశముంద‌ని తెలిపింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌నుంద‌ని పేర్కొంది. దీని వ‌ల్ల‌ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అల్ప పీడ‌న ప్ర‌భావంతో రేపు కోస్తాంధ్ర అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయ‌న్నారు. (చ‌ద‌వండి: ఏపీ: మూడు రోజులు భారీ వర్షాలు)

ఈ సంద‌ర్భంగా మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మ‌రోవైపు రాయ‌ల‌సీమ‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించాయి. రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుప‌వ‌నాలు రాగల రెండు రోజుల్లో రాయ‌ల‌సీమ‌తోపాటు కోస్తాంధ్ర‌లోనూ విస్త‌రించ‌నున్నాయి. మ‌రోవైపు ఈ నెల 10 నుంచి 12వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు. (రెండు రోజుల్లో రానున్న నైరుతి)

మరోవైపు తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలకు అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది.

మరిన్ని వార్తలు