అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో కుండపోత

22 Sep, 2019 11:22 IST|Sakshi

లోతట్టు ప్రాంతాలు జలమయం

సాక్షి,అనంతపురం/వైఎస్సార్‌ జిల్లా: రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం, ఉరవకొండలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలో‍కి వర్షపు నీరు  చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాసపురం వద్ద హంద్రీనీవా ఉప కాల్వకు గండి పడింది.

ఉధృతంగా ప్రవహిస్తున్న పీతురువాగు..
వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. పీతురు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండవాండ్లపల్లి గ్రామంలో వరద నీరు ప్రవేశించడంతో వరి, టమాట పంటలు నీట మునిగాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా నీటమునిగాయి. రాయచోటిలో కురిసిన భారీవర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత..
వరదనీరు తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఇన్‌ఫ్లో 68,601 క్యూసెక్కులు ఉండగా,ఔట్‌ ప్లో 75,817 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది.

సోమశిలా జలశయానికి భారీగా వరద నీరు..
నెల్లూరు జిల్లా  సోమశిలా జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 92,343 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 22,243 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 65 టీఎంసీలుగా ఉంది.

మరిన్ని వార్తలు