పోటెత్తిన కుందూనది

24 Aug, 2019 06:28 IST|Sakshi

33 వేల క్యూసెక్కులతో ప్రవాహం

నీటమునిగిన వంతెనలు, నిలిచిన రాకపోకలు

పెన్నానదిలో పెరుగుతున్న ఉధృతి

ప్రమాదపుటంచున బుగ్గవంక

సాక్షి, చాపాడు:  నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందూనదిలో వరద నీరు పోటెత్తతోంది. మన జిల్లాతో పాటు కర్నూలులోనూ జోరుగా వర్షాలు పడుతుంటంతో వరదనీరు ఎక్కువగా చేరుతోంది. గురువారం 24 వేల క్యూసెక్కులతో ప్రవహించిన కుందూనదిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 33,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో చాపాడు మండలంలోని అన్నవరం, సీతారామాపురం గ్రామాల వద్ద వంతెనలు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఫలితంగా అన్నవరం–మడూరు, సీతారామాపురం–అల్లాడుపల్లె దేవళాలు ప్రాంతాలకు రాకపోకలు నిలి చిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడేకొద్దీ వరద పెరిగే అవకాశం ఉందని కేసీ కెనాల్‌ డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు. అన్నవరం, సీతారామాపురం గ్రామాల వంతెన వద్ద ఎలాం టి ప్రమాదం జరగకుండా వీఆర్‌ఏలను కాపలాపెట్టినట్లు తహసీల్దారు శ్రీహరి తెలిపారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా
సిద్దవటం: భారీ వర్షాలకు నదీ పరివాహకప్రాంతాల నుంచి నీటికి కుందూ వరద ఉధృతి తోడవడంతో శుక్రవారం సిద్దవటం వద్ద పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం వరకు పాత బ్రిడ్జిపై అంతంత మాత్రంగా నీరు ప్రవహించింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గురువారం రాత్రి నుంచి పాత బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది.  ముందస్తుగా పెన్నా నది హైవే వంతెనపై పోలీసు బందో బస్తును ఏర్పాటుచేశారు.  

బుగ్గవంక జోరు
చింతకొమ్మదిన్నె : కడప నగరానికి సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టు ప్రమాదపుటంచున ఉంది. ప్రాజెక్టు చుట్టూ ఉన్న కట్టలు దెబ్బతిన్నాయి.  కట్ట చుట్టూ సిమెంట్‌ లేక మట్టితేలి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుత వర్షాలకు కొండ ప్రాంత వరదనీరు జతకలిసింది. దీంతో ఉధృతంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లలో మూడు చోట్ల రంధ్రాల నుంచి నీరు బయటకు వస్తోంది. ప్రాజెక్టుపైనున్న తాపలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలాకాలంగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదు. 4 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు నిండటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రులు నీటిని విడుదల చేశారు. అప్పటికే ప్రాజెక్టు అధ్వాన్న స్థ్దితికి చేరింది. ఈ విషయాన్ని  అప్పటి మంత్రులు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం బుగ్గవంక ప్రాజెక్టు సుందరీకణకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొద్ది రోజల క్రితం నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు.  వర్షాల దెబ్బకు పనులలో జాప్యం జరుగుతుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3500 ఎకరాలకు సాగు నీరు, జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీరు అందుతుంది. 2001లో ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో కడప నగరం జలమయమైన వైనాన్ని ప్రజలు ఇప్పటికీ మరువలేదు.


బుగ్గవంక ప్రాజెక్టు గేట్ల వద్ద నుండి లీకవుతున్న నీరు

ప్రాజెక్టు కట్ట కుంగింది..
బుగ్గవంక ప్రాజెక్టుపైన ఉన్న కట్టపై భూమి కొంత మేర కుంగింది. ఈ ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేయించకుండా రాళ్లను అడ్డుగా వేశారు. ఇప్పటికే మండలంలోని పలుప్రాంతాలలో భూమి కుంగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.
– గూడా రాజ శేఖర్‌ రెడ్డి, రైతు,నాగిరెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె. 

రాళ్లు తేలి ఉన్నాయి..
ప్రాజెక్టుకు చుట్టూ ఉన్న రాళ్లు పైకి తేలి ఉన్నాయి. కట్టపై ఎలాంటి ఒత్తిడి జరిగినా ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయమేస్తున్నది. వర్షాలు మరింత పెరిగితే ప్రాజెక్టులో నీరు అధికం అవుతుంది.  ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు చర్యలు తీసుకుంటే మంచిది.
– ఇనుకోలు బాలశివయ్య, రైతు, బయనపల్లి, చింతకొమ్మదిన్నె.

మరిన్ని వార్తలు