రాష్ట్రాన్ని పలకరించిన రుతుపవనాలు

22 Jun, 2019 04:26 IST|Sakshi
శుక్రవారం రాజమహేంద్రవరంలో జోరు వాన

మృగశిర కార్తెలో రావాల్సి ఉండగా.. పక్షం రోజుల ఆలస్యం 

తొలిరోజే రాష్ట్రమంతటా విస్తరణ 

ఆలస్యంగా వచ్చినా..లోటు భర్తీ అవుతుందంటున్న ఐఎండీ 

నేడు కోస్తాంధ్రలో భారీ వర్షాలు 

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: మృగశిర కార్తె ఆరంభంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతు పవనాలు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని పలకరించాయి. ఆరుద్ర కార్తెకు రెండు రోజుల ముందు శుక్రవారం రాష్ట్రమంతటా విస్తరించాయి. తీవ్రమైన వడగాడ్పులు, ఉక్కపో తతో అల్లాడుతున్న ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగించాయి. వాస్తవానికి ఈ ఏడాది రుతు పవనాలు 8 రోజుల ఆలస్యంగా కేరళను తాకాయి. కేరళను తాకిన ఐదారు రోజులకు రాష్ట్రంలోని రాయలసీమలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ.. కేరళను తాకిన రెండు వారాల వరకు వీటి జాడ లేకుండా పోయింది. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను ప్రభావంతో రుతు పవనాలు మందగమనంతో కదిలాయి. ఆ తుపాను బలహీనపడటంతో ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశానికి వీలుపడింది. రుతు పవనాల ఆగమనానికి సంకేతంగా అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్రల్లో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో నైరుతి నుంచి రుతు పవన గాలులు వీస్తున్నాయి.

వీటి ఆధారంగా శుక్రవారం నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. మునుపెన్నడూ లేనివిధంగా ఈ రుతు పవనాలు ఒక్కరోజులోనే రాయలసీమ, కోస్తాంధ్ర (యానాం సహా) అంతటా విస్తరించాయని వెల్లడించింది. రుతు పవనాల రాకతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శనివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. 

వర్షాలకు లోటుండదు
‘ఆంధ్రప్రదేశ్‌లోని 60 శాతం పైగా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ లేదా నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. భూమి నుంచి నాలుగు కిలోమీటర్ల ఎత్తువరకూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తున్నాయి. రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయనడానికి ఇవే నిదర్శనాలు. వీటి ఆధారంగానే రాష్ట్రం మొత్తం నైరుతి ఆవహించిందని ధ్రువీకరించరించాం’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధిపతి వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘సాధారణంగా జూన్‌ 5, 6 తేదీల్లో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాలి. ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా 21వ తేదీన వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కురవాల్సిన వర్షం కంటే 67 శాతం పైగా తక్కువ వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు జాప్యం కావడం వల్ల జూన్‌లో ఏర్పడిన లోటు జూలై, ఆగస్టు నెలల్లో పూడుతుంది. ఈ సీజన్‌లో (జూన్‌–సెప్టెంబర్‌ మధ్య) సాధారణ వర్షపాతం (97 శాతం) నమోదవుతుంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 912 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ఈ మేరకు వర్షపాతం నమోదవుతుంది. రుతు పవనాల రాక ఆలస్యమైనప్పటికీ వర్షాల పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది’ అని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వివరించారు.

చల్లబడిన వాతావరణం
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటిదాకా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు వీచాయి. శుక్రవారం సాధారణం కంటే 2–5 డిగ్రీల వరకు తక్కువగా రికార్డయి వాతావరణం చల్లబడింది. ఇకపై ఉష్ణోగ్రతలు అదుపులోనే ఉండనున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా కావలిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని వార్తలు