వాన హోరు.. వరద జోరు

20 Aug, 2018 13:36 IST|Sakshi
అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీని వీడని వరద

వరదల బారిన 44 గ్రామాలు

ఇంకా జలదిగ్బంధంలోనే లంకలు

లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు

శాంతిస్తున్న గోదావరి, శబరి తగ్గుతున్న నీటి ఉధృతి

జిల్లావ్యాప్తంగా భారీ వర్షం అస్తవ్యస్తమైన జనజీవనం

అమలాపురం: గోదావరి శాంతిస్తోంది. వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. కానీ ఇప్పటికీ గోదావరి లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎగువన గోదావరి శాంతిస్తున్నా.. దిగువన కోనసీమలో వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అసలే వరద చుట్టుముట్టడంతో ఇబ్బంది పడుతున్న లంకవాసులు.. ఆదివారం తెల్లవారుజాము నుంచీ జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో మరింతగా ఇబ్బందుల పాలయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 44 గ్రామాలు వరదల బారిన పడినట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదివారం తెలిపారు.

తగ్గుతున్న నీటి ఉధృతి
గోదావరిలో వరద ఉధృతి కొంతవరకూ తగ్గినా ఆదివారం రాత్రికి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. సాయంత్రం ఆరు గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 10,69,606 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో 11,74,349 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, అది మధ్యాహ్నం 12 గంటల సమయానికి 11,17,362 క్యూసెక్కులకు తగ్గింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు.. తెల్లవారేసరికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఆదివారం సా యంత్రం కూనవరం వద్ద నీటి ఉధృతి పెరగడంతో గోదావరి వరద స్వల్పంగా పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో వరద తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉపనదుల్లో కూడా వరద తగ్గుముఖం పడుతోంది. అయితే పరీవాహక ప్రాంతంలో వర్షాలు పడితే మాత్రం వరద పెరిగే అవకాశాలూ ఉంటాయని భావిస్తున్నారు.

ముంపు ముట్టడిలో..
బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి తగ్గుతున్నా.. దిగువన గోదావరి లంకలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి.
ఏజెన్సీలో గోదావరి, శబరి నదుల్లో వరద ఉధృతి తగ్గినా ఇప్పటికీ పలు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.
చింతూరు మండలం సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు–వీఆర్‌ పు రం మండలాల మధ్య, చింతూరు మండలం లోని 11 గ్రామాల మధ్య నాలుగు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిపోయాయి.
రాజమహేంద్రవరం బ్రిడ్జిలంకలో నివాసముంటున్న వారిని వరద నేపథ్యంలో నగరానికి తరలించిన విషయం తెలిసిందే. వరద ఉధృతి తగ్గకపోవడంతో లంకకు చెందిన 259 మంది పునరావాస కేంద్రంలోనే ఉన్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్‌ దిగువన గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల పరిధిలోని లంకల్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది.
కపిలేశ్వరపురం, ఆత్రేయపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు, అయినవిల్లి, కొత్తపేట, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని పలు లంక గ్రామాల్లో జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఈ మండలాల్లోని సుమారు 23 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. రోడ్ల మీద రాకపోకలు చేసే అవకాశం లేకపోవడంతో స్థానికులు పడవలను ఆశ్రయిస్తున్నారు.
లంకల్లోని కూరగాయల పాదులు, తోటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వరద వల్ల వీటితోపాటు చిన్న సైజులో ఉన్న అరటి మొక్కలు దెబ్బ తింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడిమూడిలంకలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కె.ఏనుగుపల్లిలంక, శివాయిలంకల్లో శనివారం మునిగిన రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం, పాశర్లపూడిలోని శ్రీరామపేటలను ముంపు వీడలేదు. అప్పనపల్లి కాజ్‌వేపై ప్రయాణికులను పడవలతో చేరవేస్తున్నారు.
మలికిపురం మండలం రామరాజులంక, దిండి, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, సఖినేటిపల్లి, సఖినేటిపల్లిలంకలు; రాజోలు మండలంలోని రాజోలు లంక, శివకోడులంక, పొదలాడ లంకలు నీట మునిగాయి. సుమారు 2 వేల ఎకరాల్లో వరి చేలు ముంపు బారిన పడి దెబ్బతిన్నాయి.
అయినవిల్లి కాజ్‌వేపై వరద ఉధృతి తగ్గింది. ఉదయం పడవల మీద రాకపోకలు సాగించగా, సాయంత్రం నుంచి నడిచే వెళ్తున్నారు.
ముమ్మిడివరం మండలంలోని సుమారు 9 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. లంకాఫ్‌ ఠాణేల్లంక, కమిని, గురజాపులంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.
కాట్రేనికోన మండలం నడవపల్లి, పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటి మొగ, పల్లం, పోర గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి.
వ్యక్తి మృతి
గోదావరి వరద బారిన పడి ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన పి.పుల్లయ్య (57) ఏటిగట్టు మీద గేదెను మేపుతుండగా పొరపాటున కాలుజారి గోదావరిలో పడి మృతి చెందాడు.

వర్షంతో స్తంభించిన జనజీవనం
వరదకు వర్షం తోడవడంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం పడుతూనే ఉంది. దీంతో కోనసీమలోని మురుగు కాలువలు ప్రమాదకరంగా మారాయి. శనివారం ఉదయం ఎనిమిది నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లావ్యాప్తంగా 10.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మారేడుమిల్లిలో అత్యధికంగా 49.6, అత్యల్పంగా కాట్రేనికోన మండలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలోని రంపచోడవరంలో 26.8, ఎటపాక 24.2, కూనవరం 24.2, చింతూరు 28.8, వీఆర్‌ పురం 23.8, రాజవొమ్మంగి 31.2; మెట్టలోని రౌతులపూడి 20.8, కోటనందూరు 16.4, తుని 15, తొండంగి 21.4; కోనసీమలోని మామిడికుదురు 33.2, రాజోలు 23, అల్లవరం 20.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల తరువాత కోనసీమలో 20.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న లంకవాసుల కష్టాలను వర్షం రెట్టింపు చేసింది. రాగల 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఇటు ప్రజలను, అటు డెల్టా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వార్తలు