ఏకధాటిగా వర్షం

17 Sep, 2013 02:55 IST|Sakshi
మక్కువ, న్యూస్‌లైన్ : జిల్లాలో పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. మక్కువలో మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం వరికి ఉపకరిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వర్షానికి దుగ్గేరు అడారుగెడ్డ, కవిరిపల్లి గోముఖినది, గుణకొండవల కొండగెడ్డల కాజ్‌వేలపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు లే కపోవడంతో సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షం కురవడంతో రైతులకు ఊరట కలిగింది.
 
 రోడ్లు జలమయం
 పార్వతీపురం టౌన్ : పట్టణంలో సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.భారీ వర్షానికి మేదరవీధి నుంచి వెంకటేశ్వర కళామందిర్ వరకు ఉన్న ప్రధాన రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. రోడ్డు కంటే ఎత్తులో కాలువ ఉండడంతో వర్షపు నీటితోపాటు మురుగునీరు మోకాలు మునిగిన వరకు నిలిచింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై ఉన్న వ్యాపారులు, తోపుడు బళ్లు వ్యాపారులు అవస్థలు పడ్డారు. మెయిన్ రోడ్డులో కొన్ని చోట్ల షాపుల్లోకి నీరు చేరింది. ఈ వర్షం పంటలకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 
 
 మోస్తరుగా వర్షం
 బొబ్బిలి :  బొబ్బిలి పట్టణంలో మోస్తరుగా వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీగా వర్షం కురిసింది. మళ్లీ సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి వర్షపు జల్లులు పడ్డాయి. ఈ వర్షాలు పంటలకు అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 
 
 రైతుల ఆనందం
 గరుగుబిల్లి : గరుగుబిల్లి, పెద్దూరు, బి.వి.పురం, గొట్టివలస తదితర గ్రామాల్లో రెండు గంటలపాటు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్ర ఐదు గంట ల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షంతోపాటు ఈదురు గాలులు వీచాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎండితున్న వరి నారుకు ఈ వర్షాలు ఎంతో ఉపకరిస్తాయని రైతులు తెలిపారు. 
 
 ఊరటనిచ్చిన వర్షం
 గుమ్మలక్ష్మీపురం : మండలంలో కురిసిన భారీ వర్షం రైతులకు ఊరటనిచ్చింది. నాలుగు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, సాగునీరు లేకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్న తరుణంలో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేదారిపురం, వంగర, కీసరిగూడ, గుమ్మలక్ష్మీపురం, కొత్తగూడ, ఎల్విన్‌పేట గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. 
మరిన్ని వార్తలు