విస్తారంగా వానలు

1 Sep, 2014 01:38 IST|Sakshi
విస్తారంగా వానలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీరు రోడ్లపైకి చేరడంతో... కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యాయి. దీంతోపాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర తెలంగాణల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉండటంతో వచ్చే 48 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలుపడే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గత 24 గంటల్లో తెలంగాణలో సరాసరి 6.8 మిల్లీమీటర్ల (0.68 సెంటీమీటర్లు) వర్షం కురవాల్సి ఉండగా... 13.9 మి.మీ.(1.39 సెంటీమీటర్లు) కురిసిందని ఆయన చెప్పారు.

 

అంటే ఏకంగా 106 శాతం అధిక వర్షపాతం నమోదైందని.. ఈ వారంలో పడిన వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు జూన్, జూలై నెలల్లో రుతుపవనాలు రాకపోవడంతో వర్షపాతం కొరత కొనసాగుతోం దని.. ఇంతగా వర్షాలు పడుతున్నా సాధారణ స్థాయికి వర్షపాతం చేరుకోలేదని చెప్పారు. ఇప్పటికీ తెలంగాణలో 37 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో ఇంకా 52 శాతం వర్షపాతం లోటు ఉందని వెల్లడించా రు.  శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు రంగారెడ్డి జిల్లా పరిగిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


 ముందస్తు రబీకి సిద్ధం కండి..


 ‘ఈ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. కీలకమైన సమయంలో వర్షాలు పడ్డాయి. లేకుంటే ఖరీఫ్ సీజన్ ఇబ్బందుల్లో పడేది. వివిధ దశల్లోని పంటలు ఈ వర్షాలతో ప్రాణం పోసుకున్నాయి..’’ అని వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు దండ రాజిరెడ్డి చెప్పారు. రైతులు ముందస్తు రబీకి సిద్ధం కావాలని, తద్వారా ఆయా పంట లకు ప్రయోజనం కలుగుతుందని సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ వినియోగం 60 మిలియన్ యూనిట్ల నుంచి 40 మిలియన్ యూనిట్లకు పడిపోవడంతో.. ప్రభుత్వ ఊపిరిపీల్చుకుంటోంది.


 నిలిచిపోయిన రవాణా..


 రంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. పోటెత్తుతున్న వరదలతో రవాణావ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాలోని కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ వాగులు సైతం పొంగి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. కాగ్నా వరద ప్రభావంతో తాండూరు-మహబూబ్‌నగర్ మార్గం దెబ్బతింది. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కంది-షాద్‌నగర్, చేవెళ్ల-శంకర్‌పల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిగి ప్రాంతంలో సాగునీటికి కీలకమైన లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు ప్రవహిస్తోంది. చెరువులకు గండ్లు పడడం.. ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో పంటలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. వరద ధాటికి పత్తి, ఇతర పంటలు నీట మునిగాయి.  


 జలాశయాలకు కళ


 రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 61 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన  నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం జూరాలకు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల 18 గేట్లు తెరిచి 1.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల బ్యారేజీ నుంచి కూడా వరద వస్తోంది.
 
 దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 208.28 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 884.30 అడుగులకు చేరుకుంది. మరో 4.5 టీఎంసీల నీరు తోడైతే గరిష్టస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుకోనుంది. ఆ తర్వాత రెండు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గేట్లను తెరిచేందుకు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీశైలం రానున్నట్లు తెలిసింది. ఇక నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 551.80 అడుగులుగా ఉంది. గోదావరి పరివాహకంలోనూ ఈ సీజన్‌లో తొలిసారి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఇప్పటివరకు చుక్కనీరు కూడా చేరని నిజాంసాగర్, సింగూరు, కడెం, ఎస్సారెస్పీలోకి సన్నని ధారలా నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ప్రవాహాలు క్రమంగా పెరుగుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
 
 చురుగ్గా నైరుతి


 సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం/మచిలీపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నైరుతి రుతుపవనా లు చురుగ్గా ఉన్నాయి. తెలంగాణలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా, ఏపీ లో  అనేక ప్రాంతాల్లో చెదురుమదురు వాన లే కురుస్తున్నాయి.  కోస్తాంధ్ర, తెలంగాణ లో చాలా చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లు లు పడే అవకాశాలున్నట్టు తెలిపింది.
 
 తడిసి ముద్దయిన రాజధాని
 
 
 నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయిపోయింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వాగులను తలపిం చాయి. సాయంత్రం 5.30 గంటల వరకు 1.7 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1,763.5 అడుగులకు గాను ప్రస్తుతం 1,752 అడుగులకు చేరుకుంది. గత రెండ్రోజుల్లోనే మూడు అడుగుల మేర పెరిగింది. ఇక ఉస్మాన్‌సాగర్ గరిష్ట మట్టం 1,790 అడుగులకు గాను ఆదివారం సాయంత్రానికి 1,771 అడుగులకు చేరింది.

మరిన్ని వార్తలు