బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం

19 Oct, 2017 23:10 IST|Sakshi

విశాఖలో భారీ వర్షం

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం దక్షిణ ఆగ్నేయ దిశగా పూరికి 370కిలోమీటర్లు, ఒరిస్సా చాంద్‌బలికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం  ఉత్తరం వాయువ్యదిశగా పయనిస్తోందని, నేటి అర్థరాత్రి లేదా రేపు తెల్లవారుజామున పూరీ చాంద్‌బలీ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రానున్న 18గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న24 గంటలపాటు కోస్తాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మత్సకారులకు ఇప్పటికే ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్సకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా ఇప్పటికే ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా కోస్తా జిల్లాల వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయ సహకారాల కోసం కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.  

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్లు
కలెక్టరేట్‌ కార్యాలయం : 1800-4250-0002
గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌: 0891-2569335

మరిన్ని వార్తలు