కణేకల్లు కకావికలం

7 Jun, 2019 11:12 IST|Sakshi
తారకరామనగర్‌లో కూలిన వీరేష్‌ పూరిగుడిసె

బీభత్సం సృష్టించిన గాలీవాన

ధ్వంసమైన  పూరిగుడిసెలు, కూలిన విద్యుత్‌ స్తంభాలు

గుడిసె గోడ కూలి  యువకుడి మృతి

పిడుగుపాటుకు నాలుగు గొర్రెల మృతి

రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం

అనంతపురం, కణేకల్లు: బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మండలం కకావికలమైంది. బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి విలవిల్లాడింది. గాలుల బీభత్సానికి గుడిసెలు కూలిపోయాయి. పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బుధవారం రాత్రి నుంచే..
మండలంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. కణేకల్లు, యర్రగుంట, గెనిగెర, జక్కలవడికి, ఆలూరు, కణేకల్లు క్రాస్, మారెంపల్లి, పుల్లంపల్లితోపాటు మండల వ్యాప్తంగా భారీ వర్షం పడింది. రాత్రి 10.30 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షపాతం 31.88 మిల్లిమీటర్లుగా నమోదైంది. వంకలు, వాగులు పొంగి ప్రవహించాయి. వర్షం కన్నా గాలి హోరెత్తించింది. కణేకల్లులోని తారక రామనగర్‌లో వీరేష్‌ అనే వ్యక్తి పూరిగుడిసె రేకుల పైకప్పు గాలికి ఎగిరి దూరంగా పడింది. ఈ క్రమంలోనే గుడిసె గోడ కూలి నిద్రలో ఉన్న వీరేష్‌ (34)పై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే కాలనీలో కురుబ నాగప్ప, ఆదిలక్ష్మీ, చిక్కణ్ణ, ఎర్రిస్వామితోపాటు మరో ఐదుగురికి చెందిన పూరిగుడిసెల పైకప్పులు లేచిపోయాయి. ఉరుములు, మెరుపులతో ఓ వైపు వర్షం మరో వైపు గుడిసెల పైకప్పులు లేచిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో విద్యుత్‌ స్తంభాలు పడి కరెంటు కూడా లేకపోవడంతో ఎక్కడికి పోవాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఆదిలక్ష్మీ తన పిల్లలతో భయం... భయంతో పరుగులు తీసి తన ఇంటికి దూరంగా తెలిసిన వారి ఇంట్లో తలదాచుకొంది. వృద్ధదంపతులైన ఎర్రిస్వామి, లింగమ్మ పూరి గుడిసెలోని ధాన్యమంతా వర్షార్పణమైంది. ఈదురుగాలులకు కణేకల్లు, యర్రగుంట, మారెంపల్లి, ఆలూరు, జక్కలవడికి, మాల్యం, గెనిగెర తదితర గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. మండల వ్యాప్తంగా 100 వరకు విద్యుత్‌స్తంభాలు పడిపోయినట్లు విద్యుత్‌శాఖ ఏఈఈ భీమలింగ తెలిపారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

పిడుగుపాటుకు 4 గొర్రెల మృతి
కణేకల్లులోని తారకరామనగర్‌ శివారు ప్రాంతంలో పిడుగుపాటుకు గంగవరం ఫకృద్దీన్‌ అనే రైతుకు చెందిన నాలుగు గొర్రెలు మృతి చెందాయి. దీంతో రూ.25 వేల నష్టం వచ్చినట్లు ఆయన తెలిపారు.

నేలకూలిన వృక్షాలు..         
ఈదురుగాలులకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. కణేకల్లులోని మండల పరిషత్‌ కార్యాలయంలో పెద్ద తుమ్మ చెట్టు, పాత పోలీసుస్టేషన్‌లో చెట్టు పడిపోయింది. రామనగర్, తారకరామనగర్‌లో ఏ వీధిలో చూసినా చెట్లు పడిపోయాయి. యర్రగుంటలో చెట్లు పడి రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. యర్రగుంటలో రైతు రంగన్న నిల్వ ఉంచిన గోదాములో పై కప్పు రేకులు ఎగిరిపోయి 40 బస్తాల వరిధాన్యం తడిచిపోయింది. దీంతో రూ.70 వేలు నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు