జల దిగ్భంధంలో పలు గ్రామాలు..

20 Sep, 2019 12:43 IST|Sakshi

ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు, వంకలు

పలు చోట్ల రాకపోకలు బంద్‌..

సాక్షి, కర్నూలు/వైఎస్సార్‌ జిల్లా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కుందూ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా జల దిగ్భంధనంలో చిక్కుకున్న పెద్ద ముడియం, నెమలిదిన్నే, గర్షలూరు, చిన్నాముడియం, వుప్పాలూరు, బలపన గూడూరు గ్రామాలకు పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందూ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో వరద ప్రభావిత గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


రాకపోకలు బంద్‌...
బనగానపల్లె నియోజకవర్గంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోవెలకుంట్ల-జమ్మలమడుగు, కోవెలకుంట్ల-నంద్యాల మధ్య రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బనగానపల్లె-రాయపాడు రహదారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగాల, వల్లంపాడు, పెద్దకొప్పెర్ల, ఎం.గోవిందిన్నె, చిన్న కొప్పెర్ల గ్రామాలు నీటమునిగాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల, చాగలమర్రి, ఉయ్యాలవాడ, దొరనిపాడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆళ్లగడ్డ పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాగలమర్రి​‍-గొడిగానూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉయ్యాలవాడలో కుందూ నది ఉధృతంగా  ప్రవహించడంతో ఆళ్ళగడ్డ కు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు భోజన వసతి, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా హాలహర్వి సమీపంలో కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో బళ్ళారి వంతెన కొట్టుకుపోయింది. ఆదోని, ఆలూరు, కర్నూలుకు రాకపోకలు నిలిచిపోయాయి.

వైఎస్సార్‌ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో రాజుపాలెం సమీపంలో వాగు పొంగిపొర్లుతోంది. ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేంపల్లె మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. వేంపల్లె సమీపంలోని గండికి వెళ్లే దారిలో ఉన్న మాల వంకతో పాటు.. నాగూరు, కత్తులూరు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగూరు-అయ్యవారుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వంక ఉధృతంగా ప్రవహించడంతో.. మూడు గ్రామాలకు కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. చక్రాయపేట మండల కేంద్రంలోని కే.రాచపల్లి సమీపంలో వంక ఉధృతంగా ప్రవహించడంతో.. అక్కడ కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. రాయచోటి మండలంలోని సిబ్యాల పెద్ద చెరువుకు గండి పడటంతో స్థానికులు, ఇరిగేషన్‌ అధికారులు గండిని పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు.

ముంపు బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
కుందూ ముంపు గ్రామాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. తెప్పలపై వెళైనా సరే ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని చెప్పారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎప్పటికప్పుడు ముంపు గ్రామాలను పర్యవేక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సుధీర్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు