‘అనంత’ జలసిరి

17 Sep, 2013 04:27 IST|Sakshi
అనంతపురం అగ్రికల్చర్/ఓబుళదేవరచెరువు/రొద్దం, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వల్ల ఈ నెల ఒకటవ తేదీ నుంచి ‘అనంత’లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ‘అనంత’ జలసిరితోపాటు పచ్చదనం సంతరించుకుంది. ఆదివారం అర్థరాత్రి నుంచి 50 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుడిబండ మండలంలో 60 మిల్లీ మీటర్లు (మి.మీ) భారీ వర్షం కురిసింది. మడకశిర 44, అనంతపురం 38.6, రొళ్ల 36, నార్పల 28.4, లేపాక్షి 27.4, యల్లనూరు 19.6, అగళి 18, తాడిపత్రి 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మోస్తరుగా వర్షాలు పడ్డాయి. యాడికి, గుంతకల్లు, గుత్తి, పామిడి, శెట్టూరు, డి.హిరేహాల్, బొమ్మనహాళ్, సోమందేపల్లి, రొద్దం, పుట్టపర్తి, తలుపుల, నల్లచెరువు మండలాల్లో వర్షపాతం నమోదుకాలేదు. ఈ ఒక్కరోజే 7.9 మి.మీ సగటు నమోదైంది. కాగా సెప్టెంబర్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఈ 16 రోజుల్లోనే ఏకంగా 209.7 మి.మీ వర్షం కురిసింది. 
 
 నిండుతున్న చెరువులు, పారుతున్న నదులు... 
 భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెక్‌డ్యాంలు, కుంటలు నిండిపోయాయి. తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు వ్యవసాయ సబ్ డివిజన్లు మినహా తక్కిన అనంతపురం, హిందూపురం, ధర్మవరం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, కదిరి వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో చాలా చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరికొన్ని చెరువుల్లోని నీరు వచ్చి చేతుతోంది. చిత్రావతి, పెన్నానదుల ప్రవాహం కొనసాగుతోంది. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల వద్ద చిత్రావతి ఉధృతంగా ప్రవహించడంతో సమీప పొలాల్లో 11 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్‌‌సఫార్మర్ నేలకొరిగాయి. విద్యుత్‌శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటంతో మరమ్మతులు చేపట్టలేదు. ధర్మవరం మండలంలో కనంపల్లి వంతెన తెగింది. లేపాక్షి మండలంలో ఉప్పరపల్లి, కల్లూరు, చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల, అమరాపురం మండలం తమ్మిడేపల్లి చెరువులు మరువలు పారుతున్నాయి. పెద్దవైన శింగనమల, పేరూరు, బుక్కపట్నం చెరువుల్లోకి వరదనీరు వస్తోంది. తనకల్లు మండలంలో చెక్‌డ్యాంలు తెగడంతో సమీప ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు రొద్దం మండలం నల్లూరు గ్రామ సమీపాపంలోని ఎస్.బి.వేణుగోపాల్‌కు చెందిన 18 ఎకరాల మామిడి తోట నీటమునిగింది.
 
 వేరుశనగపై చిగురిస్తున్న ఆశలు... 
 జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన 6.09 లక్షల హెక్టార్ల వేరుశనగలో జూన్‌లో వేసిన 50 వేల హెక్టార్లు మినహాయించి తక్కిన పంట పొలాలు ఆశాజనకంగా  ఉన్నట్లు డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఏడీఏ-పీపీ చంంద్రమౌళితో కలిసి సోమవారం ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, అనంతపురం రూరల్ ప్రాంతాల్లోని వేరుశనగ పొలాలను పరిశీలించినట్లు తెలిపారు. చెట్టుకు నాలుగైదు ఊడలు కనిపిస్తుండటంతో పంట దిగుబడులపై ఆశలు చిగురిస్తున్నాయన్నారు. కంది, ఆముదం, పత్తి పంటలు కూడా బాగున్నాయని తెలిపారు. ఖాళీగా ఉన్న పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలుగా  మేత జొన్న, ఉలవలు వేసుకోవాలని సూచించారు. వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇపుడు ఆలస్యమైనందున రబీలో ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ధర్మవరంతో పాటు మరికొన్ని చెరువుల కింద ఇప్పటికిపుడు వరి సాగు చేయదలచిన రైతులు స్వల్పకాలిక రకాలైన ఆర్‌ఎన్‌ఆర్-1444, తెల్లహంస ఎంపీయూ-1010 లాంటివి వేసుకోవాలని సూచించారు.
 
 గండ్లు పడటంతో నారపచెరువు ఖాళీ
 భారీ వర్షాలకు పూర్తిగా నిండిన ఓబుళదేవరచెరువు మండలం కొండకమర్లలోని నారపచెరువు పలు చోట్ల గండ్లు పడటంతో సోమవారం ఖాళీ అయ్యింది. సర్పంచ్ మారెన్న, గ్రామస్తులు ఆంజనేయులు, రామసుబ్బారెడ్డి తదితర రైతుల సహకారంతో జేసీబీ ద్వారా గండ్లు పూడ్చేందుకు ఎనిమిది గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. భారీ ప్రవాహంతో నీరంతా బయటకు వెళ్లిపోయింది. దీంతో సమీపంలోని పదెకరాల వరిపంట పూర్తిగా దెబ్బతింది.  
మరిన్ని వార్తలు