ప్రకాశంలో కుండపోతగా కురిసిన వర్షం

17 Sep, 2019 08:03 IST|Sakshi

జలమయమైన ఒంగోలు నగరం

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పంటల సాగుకు అనుకూలంగా మారిన వాతావరణం

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: జిల్లా కేంద్రం ఒంగోలులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఉన్నట్టుండి 6.00 గంటల సమయంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. చీకట్లు అలముకున్నాయి. అంతలోనే వర్షపు జల్లు ఆరంభమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకండా కుండపోత వర్షం కురిసింది. నగరం జలమయం అయింది. జనజీవనం స్తంభించి పోయింది. రహదారులు వాగులను తలపించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు రావడంతో వాటిని బయటకు తోడుకునేందుకు ప్రజలు శ్రమించారు. అదే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థ పడ్డారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం..
ఒంగోలు నగరంలో కుంభవృష్టి కురవటంతో ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని ప్రగతి కాలని జలమయం అయింది. దాంతో పాటు ఉత్తర బైపాస్‌లోని వెంకటేశ్వర కాలని పరిసరప్రాంతాలు, శ్రీనివాస సినిమాహల్‌ రోడ్డులోని బలరాం కాలని పరిసర కాలనిలు జలమయం అయ్యాయి. అదే విధంగా వెంగముక్కపాలెం, కేశవరాజుకుంట, చిన్న మల్లేశ్వరకాలనీ, బాలినేని భరత్‌ కాలనీ, కొత్తపట్నం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్‌ కాలనీ, నెహ్రూనగర్, అగ్రహరం రోడ్డులోని పలు కాలనీలు జలమయం అయ్యాయి.  ఒంగోలు మండలంతోపాటు పాటు సమీపంలోని సంతనూతలపాడు, కొత్తపట్నం, టంగుటూరు మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల తరువాత కూడా అడపాదడపా జల్లులు పడుతూనే ఉన్నాయి.

అదే విధంగా కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా జోరుగా వర్షం కురిసింది. కందుకూరు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో కొంత లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 133.6 మి.మి కాగా సోమవారం వరకు 44.4 మి.మి కురిసింది. సోమవారం సాయంత్రం సముద్ర తీర ప్రాంత మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. పశ్చిమ ప్రాంతంలోని కనిగిరిలో కొద్దిపాటి జల్లులు పడగా గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి వర్ష సూచనలు కనపడలేదు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో జోరుగా సాగు చేస్తున్న పంటలతో పాటు ఈ వర్షంతో రైతులకు రెట్టించిన ఉత్సాహం నింపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా