ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు

22 Oct, 2013 06:18 IST|Sakshi

న్యూస్‌లైన్ నెట్‌వర్‌‌క : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు డెల్టాతో పాటు మెట్టలో వరి, కొబ్బరి, పత్తి, ఇతర వాణిజ్య పంటల రైతులకు ఊరటనిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా అంతటా సోమవారం ఉదయం నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
 డ్రైనేజీలు పూడిపోవడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి సైతం నీళ్లుచేరాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షంతో రైతులు నారుమళ్ల సాగుకు సిద్ధమవుతున్నారు. చీని, నిమ్మ, మామిడి తదితర ఉద్యానవన పంటలకు ఈవర్షం ఉపయోగకరంగా మారింది. తిరుమలలో ఆదివారం ఉదయం మొదలైన వాన సోమవారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. శ్రీవారి ఆలయం, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. ఘాట్‌రోడ్లలో పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాగా, విజయనగరం జిల్లా తెర్లాం మండలం లోచర్ల గ్రామంలో సోమవారం పిడుగుపడి  గొర్రెల కాపరి నీలాతి లచ్చయ్య(58) మృతి చెందారు.

మరిన్ని వార్తలు