నేడు, రేపు వర్షాలే

13 Jul, 2020 05:21 IST|Sakshi

ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.

వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వెంకటగిరి, చిత్తూరులో 8 సెం.మీ., జియ్యమ్మవలస, తంబాలపల్లె, పలమనేరులో 5, తాడేపల్లిగూడెంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు