రాయలసీమలో విస్తారంగా వర్షాలు

17 Sep, 2019 12:15 IST|Sakshi

విరిగిపడిన కొండ చరియలు..

పొంగి ప్రవహిస్తోన్న వాగులు

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

సాక్షి, కర్నూలు: జిల్లాలో గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి పర్యటించారు. బాధితులకు భోజనం, వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాధితులకు ఇబ్బందులు కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు, హనుమంతు గుండం, బి.ఉప్పులూరు గ్రామాలు.. కోవెలకుంట్ల మండలంలోని లింగాల, వల్లంపాడు, ఎం. గోవిందిన్నె, చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 6 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

జల దిగ్బంధనంలో మహానంది ఆలయం..
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మహానంది దేవస్థానాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. మహానంది కోనేర్లు చెరువులను తలపిస్తున్నాయి. మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానందికి వెళ్లే మార్గంలో వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కారణంగా మహానందిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తప్పిన పెను ప్రమాదం..
వైఎస్సార్‌ జిల్లా: పాగేరు బ్రిడ్జి మీద పెన్నా,కుందు నదుల నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కమలాపురం-ఖాజిపేట ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చక్రాయపేటలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాయచోటి రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు విరిగి పడిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంబంధింత అధికారులు పట్టించుకోకపోవడంతో.. కొందరు యువకులు కొండ చరియలను తొలగిస్తున్నారు. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన  నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం..
కర్నూలు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు..నంద్యాల-గిద్దలూరు, గాజులపల్లి-దిగువ మెట్ట మధ్య రైలు మార్గంలో పట్టాలు తెగిపోవడంతో గుంటూరు-గుంతకల్‌ మధ్య  రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు