వణికిస్తున్న వర్షాలు

24 Oct, 2019 07:32 IST|Sakshi
ఎచ్చెర్ల క్యాంపస్‌: నీటితో చెరువును తలపిస్తున్న బొంతలకోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణ

రెండు రోజులుగా కుండపోత

మరో రెండు రోజులు పడే అవకాశం

నిండిన చెరువులు, పొంగుతున్న వాగులు

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

నేడు పాఠశాలలకు సెలవు

కలెక్టరేట్‌లోకంట్రోల్‌ రూమ్‌  08942 240557

ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.. చెరువులు నిండి, వాగులు పారుతూ భయాందోళన రేకెత్తిస్తున్నాయి.. బుధవారం జిల్లాలో మొత్తం 1443 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంశధార, నాగావళి నదులు నిలకడగా ఉన్నప్పటికీ మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గురువారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ జె.నివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో రెండు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. సోమవారం రాత్రి మొదలై మంగళ, బుధవారాల్లో వదలకుండా వానలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొరలి భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన నదులు, చెరువులు నీటితో నిండి పారుతున్నాయి. బుధవారం జిల్లాలో 1443 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 38 మి.మీలు పడింది. ఎక్కువగా కోటబొమ్మాళిలో 90.4 మిమీలు, పోలాకిలో 84.2, నరసన్నపేటలో 82, మందసలో 75.4, టెక్కలిలో 63.6, గారలో 62, వజ్రపుకొత్తూరులో 58.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. టెక్కలి డివిజన్‌లో 47.9 మిమీలు, శ్రీకాకుళం డివిజన్‌లో 44.1 మిమీలు, పాలకొండ డివిజన్‌లో 22.8 మీమీలు నమోదైంది. ప్రధాన నదులు వంశధార, నాగావళి నిలకడగా ఉన్నాయి. వరదలు వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.   సరుబుజ్జిలి మండలం అలికాం–బత్తిలి (ఏబీ) ఆర్‌అండ్‌బీ రహదారిలో బప్పడాం సమీపంలో కల్వర్టు డైవర్స్‌ వద్ద బుధవారం భారీ గండి పడింది. దీంతో శ్రీకాకుళం, కొత్తూరు నుంచి వచ్చే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మందస మండలంలోని ఉద్దానంలోని తీర ప్రాంతమైన దున్నవూరు పంచాయతీ, గెడ్డవూరు వద్ద సముద్రం బుధవారం ముందు రావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో పూడిలంక వాసులు మళ్లీ బోటును ఆశ్రయించాల్సివచ్చింది. వరి పంటలకు ప్రస్తుత వర్షాలు అనుకూలంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఎక్కువగా వరి పంట పొట్టదశ, వెన్ను దశలో ఉన్నందున ఈ వర్షాలు లాభదాయకంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు నిరాటకంగా కురవడంతో పత్తి పిందెలు, పూత రాలిపోతున్నాయి. దీంతో పత్తి రైతులకు నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు.

అప్రమత్తంగా ఉండాలి:మంత్రి కృష్ణదాస్‌
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి «ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు  బుధవారం ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. సముద్రంలో 4.5 మీటర్ల ఎత్తువరకు అలలు వస్తున్నాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆయన తెలిపారు. తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని తెలిపారు. పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని, మందులు, వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒడిశా జల వనరుల శాఖ అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని, అక్కడ వర్షాలు, నదులు జల ప్రవాహం ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. 

మరిన్ని వార్తలు