భారీ వర్షాలతో జనం అవస్థలు

1 Aug, 2013 03:20 IST|Sakshi

జి.మాడుగుల, న్యూస్‌లైన్: మండలంలో రెండు రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలతో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో మగ్గుతున్నారు. పలు గిరిజన గ్రామాల్లో చెట్లు నేల కూలాయి. కొన్ని గ్రామాల్లో రేకులు, గడ్డి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లువ్వాసింగి- సంగులోయ గ్రామాల మధ్య గెడ్డ, బొయితిలి-కిల్లంకోట మార్గ మధ్యలోని కోడిమామిడి గెడ్డ, కుంబిడిసింగి వెళ్లే మార్గం లోని మత్స్యగెడ్డ, కంఠవరం- పినలోచలి మార్గంలోని మత్స్యగెడ్డ, ఎన్.కొత్తూరు-మద్దివీధి రోడ్డులోని గెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు నిత్యావసర సరుకుల కోసం, రోగాలతో బాధపతున్న వారు ఆస్పత్రులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. జి.మాడుగుల లో బుధవారం జరిగిన వారపు సంతకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు తడిచి ముద్దయ్యారు.
 
 పలు ఇళ్లు ధ్వంసం
 ముంచంగిపుట్టు : మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మంగళవారం రాత్రి వనుగుమ్మ గ్రామంలో బి.కమల అనే మహిళకు చెందిన ఒక గృహం కూలిపోయింది. కె.మహదేవ్, బి.అయితలకు చెందిన ఇళ్లపై చెట్టు కూలడంతో పై కప్పులు ధ్వంసమయ్యాయి. పాత ముంచంగిపుట్టు, సుజనకోట గ్రామాలలో జి.లచ్చిమి, ఎ.సన్యాసిల  గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు తమను అదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు