పిడుగుపోటు.. మృత్యుకాటు

1 Jun, 2018 13:41 IST|Sakshi
తురకపాలెంలో తగలబడుతున్న వరిగడ్డి వాము

జిల్లాలో గాలివాన బీభత్సం

పిడుగుల ధాటికి ఏడుగురు మృతి

విరిగిన విద్యుత్‌ స్తంభాలు,    నేలకొరిగిన భారీ వృక్షాలు

పైకిలేచిన ఇళ్లపై కప్పులు

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

చాలా రోజుల తర్వాత వానజల్లులు కురుస్తున్నాయనుకున్నారు.. కానీ వారి బతుకులపైనే పిడుగుల వాన కురుస్తుందని గుర్తించలేకపోయారు.. ఆకాశంలో మెరుపుల వెలుగు చూసి కళ్లు మూసుకున్నారు.. ఆ వెనుకే మృత్యువై వచ్చిన పిడుగు తమ కళ్లను శాశ్వతంగా మూసేస్తుందని గమనించలేకపోయారు.. జోరువానకు చల్లబడుతున్న నేల తల్లిని చూసి మురిసిపోయారు.. ఆ వానతోపాటు వచ్చిన పిడుగులు తమను అదే నేలలో కలిపేస్తాయని తెలుసుకోలేకపోయారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పిడుగుల ధాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రకాశం జిల్లావాసులు కాగా.. ఒక మహిళ ఉన్నారు. ఆకాశం నుంచి పడిన పిడుగుల దెబ్బకు మృతుల కుటుంబాల గుండెలు కన్నీటి ధారలు మారాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. గురువారం ఒక్కసారిగా మారిన వాతావరణంతో పలుచోట్ల పడిన పిడుగులు ధాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. చాలా చోట్ల చెట్లు నెలకొరిగాయి. నరసరావుపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. దొండపాడులో గేదెలను మేతకు తీసుకెళ్లిన  చిన్నపురెడ్డి శివారెడ్డి(60) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో పశువులను మేపేందుకు వచ్చిన అంచా శివకుమారి స్వల్పంగా గాయపడింది. శివారెడ్డి మృతికి తహసీల్దార్‌ విజయజ్యోతికుమారి, వీఆర్‌వో బ్రహ్మేశ్వరరావు సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. 

ప్రకాశం జిల్లా సంతమాగులూరు గురుజేపల్లికి చెందిన నలుగురు పమిడిమర్రు సమీపంలో గొర్రెలను మేపేందుకు వచ్చారు. వర్షం కురుస్తుండటంతో గొర్రెలతో సహా చెట్టు కిందకు చేరారు. ఇదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో అనంత పెద్దబ్బాయి(36) అక్కడికక్కడే మృతి చెందగా, దారా లక్ష్మయ్య, దారా కోటేశ్వరరావు, చిన్నం పూర్ణయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలోని త్రిముఖ శివలింగంపై పిడుగు పడింది. ఈ ఘటనలో శివలింగం త్రిశూలం స్వల్పంగా దెబ్బతింది.

ఫిరంగిపురం మండలంలోని యర్రగుంట్లపాడు గ్రామంలో శివాలశెట్టి ప్రసాద్‌ (57) అతని స్నేహితుడుపి.నాగేశ్వరరావులు జీవాలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. సాయంత్రం 4.30 సమయంలో పిడుగు వారి సమీపంలో పడింది. ఈ ఘటనలో ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందగా నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలైన నాగేశ్వరరావును చికిత్సకోసం 108లో సత్తెనపల్లి వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ పార్థసారథి , వీఆర్వో అంజలిలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
క్రోసూరు మండలంలోని 88 త్యాళ్లూరులో కుంభా కోటేశ్వరమ్మ(60) కూలిపనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పిడుగుపడి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళా కూలీలకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఇదే గ్రామంలో పొలంలో మేత మేస్తున్న గేదె, దూడ కూడా మృత్యువాత పడ్డాయి.
నాగార్జున సాగర్‌ డ్యాం దిగువన ఉన్న కొత్త బ్రిడ్జీ సమీపంలో పిడుగుపడి దుగ్యాల అంజయ్య(35) స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే హిల్‌కాలనీలోని ప్రభుత్వ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అంజయ్య సాగర్‌ డ్యాం దిగువన కృష్ణానదిపై ఉన్న కొత్తబ్రిడ్జీపై బత్తాయి జ్యూస్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు చిన్నపిల్లలే. సాగర్‌కు వచ్చే పర్యాటకులకు అంజయ్య, నాగమ్మలు సుపరిచితులు.  
ముప్పాళ్ల మండలంలో మండలంలోని నార్నెపాడు గ్రామానికి చెందిన దాసరి బొల్లయ్య(27)  గేదెలు మేపుకునేందుకు వెళ్లాడు. వాతావరణం మారడంతో ఇంటికి వెళ్దామని బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులు జగన్నాథం, నారాయణమ్మలకు ఒక్కడే కొడుకుకావటంతో మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.   
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పోపూరి అశోక్‌(28) పొలంలో ఉన్న ఎద్దులను తోలకొచ్చేందుకు వెళ్లాడు. ఎద్దులు ఇంటికొచ్చినప్పటికీ అశోక్‌ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వైపు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెంది ఉండడాన్ని గమనించారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమారుడు ఉన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈదరుగాలుల ధాటికి విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలో రెండు, రెంటపాళ్లలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి, మరో ఆరు చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలి పోయాయి. బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌  సర్వర్‌ డౌన్‌ అయ్యింది.  సత్తెనపల్లి మండలం గోరంట్ల గ్రామ సమీపంలోని పొలాల్లో పిడుగుపాటుకు కట్టమూరు గ్రామంలో నందిగం ప్రకాశంకు చెందిన రూ.1.40 లక్షలు విలువ చేసే రెండు గేదెలు, రెంటపాళ్లలో పాలపాటి వెంకటప్పయ్యకు చెందిన రూ.65 వేలు విలువ చేసే గేదె, నంబుల సైదయ్యకు చెందిన రూ.50 వేలు విలువ చేసే గేదె, పట్టణంలోని శాస్త్రీనగర్‌లో సీతారామయ్యకు చెందిన రెండు గేదెలు, సుందరయ్య కాలనీలో శేషగిరికి చెందిన ఒక గేదె మృతి చెందాయి. అలాగే కంకణాలపల్లి గ్రామం వద్ద రెండు చెట్లు పడి పోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైతులు పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. పలు వార్డుల్లో కాలువలకు వర్షపు నీరు చేరండంతో మురుగు రోడ్లపై ప్రవహించింది.  రాజుపాలెం మండలం కస్తుర్బా పాఠశాల వద్ద, పులిచింత ఆర్‌ అండ్‌ ఆర్‌ సెంటర్‌ వద్ద చెట్లు కూలి పోయి ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది.

>
మరిన్ని వార్తలు